వైవిధ్యంగా ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్‌’

చిన్న చిన్న పాత్రలతో కమెడియన్‌ గా మొదలెట్టి ఇప్పుడు కథానాయకుడిగా కూడా సినిమాలు చేస్తున్న సుహాస్‌ ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’ అనే నూతన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దీనికి నూతన దర్శకుడు దుష్యంత్‌ కటికనేని దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది, ఇందులో కామెడీ, చిన్న కైమ్ర్‌, వూర్లో వుండే చిన్న చిన్న గొడవలు కలగలిపి ఒక కథగా మలిచినట్టుగా తెలుస్తోంది. సెలూన్‌ షాపు నడిపే సుహాస్‌ ఆ వూర్లో ఏమి జరిగినా అన్నిటిని తనవిూదే వేసుకొని ఎలా చిక్కుల్లో పడ్డాడు, వాటినుంచి ఎలా బయటపడ్డాడు అనే ఇతివృత్తంగా ఈ ట్రైలర్‌ చూస్తుంటే కనపడుతోంది.

ఇంతకు ముందు సుహాస్‌’కలర్‌ ఫోటో’ అనే చిత్రంలో కథానాయకుడిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమాకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఆ తరువాత ‘రైటర్‌ పద్మభూషణ్‌’, ‘మను చరిత్ర’ అనే రెండు సినిమాల్లో నటించాడు. ఇప్పుడు ఈ ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’ తో ఫిబ్రవరి 2న వస్తున్నాడు.

బన్నీవాస్‌, వెంకటేష్‌ మహా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు, నిర్మాత ధీరజ్‌ మొగిలినేని. సుహాస్‌ సరసన శివాని నగరం అనే అమ్మాయి కథానాయికగా చేస్తుండగా, గోపరాజు రమణ ఇంకో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. కొత్త నటులకి ఈ సినిమా ద్వారా అవకాశం కలిపించినట్టుగా కనపడుతోంది.