Akshya Kumar: గత కొన్నేళ్లుగా బాలీవుడ్లో మిగతా స్టార్లను వెనక్కి నెట్టి టాప్ మోస్ట్ పాపులర్ హీరోల సరసన చేరిపోయాడు అక్షయ్ కుమార్. ఒకప్పుడు ఖాన్ త్రయం ముందు ఎవరూ నిలవగలిగేవారు కాదు కానీ.. అక్షయ్ వరుస హిట్లు కొట్టడం.. అలాగే వేగంగా సినిమాలు చేయడం ద్వారా వాళ్లను దాటి ముందుకెళ్లిపోయరని చెప్పవచ్చు. తన నటనతో వెండి తెర ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు అక్షయ్.
అయితే నేషనల్ లెవెల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ స్టార్ హీరోకి ఇప్పుడు ఓ పెద్ద చిక్కు వచ్చి పడింది. ఎప్పుడెప్పుడు ఆయన సినిమా విడుదల అవుతుందా అని ఎదురు చూసే అభిమానులే ఇప్పుడు అడ్డంకులు సృష్టిస్తుండడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు అక్షయ్ సినిమా తీసిన మూవీ నిర్వాహకులు.
ఇక వివరాల్లోకి వెళితే, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన బచ్చన్ పాండే సినిమా ఇటీవలే విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రానికి భారీ స్థాయిలో మంచి రెస్పాన్సే వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు అంతే స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక పోతే ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ పాత్ర ప్రజలను హత్య చేసే ఒక హింసాత్మక నేరస్థుడిగా ఉంటుంది. ఈ పాత్రకు పాండే అనే ఇంటి పేరును ఉపయోగించడంతో ఈ వివాదం రాజుకున్నట్టు సమాచారం. హిందువులను కించపరిచే విధంగా ఈ పాత్రను చిత్రీకరించారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ సినిమాను ప్రదర్శించ కూడదని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాను ఎవరూ ప్రోత్సహించకూడదని వారు కోరుతున్నారు. దీంతో #BoycottBachchhanpandey అనే హాష్ టాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.