ఎన్నికల్లో రాజమౌళి.. ఆ బాధ్యత ఇచ్చిన కలెక్టర్

రాజమౌళి.. ఈ పేరు తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. స్క్రీన్ రైటర్, డైరెక్టర్ గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా పలు చిత్రాలను నిర్మించాడు. అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. 2001లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టాడు. ఆ తర్వాత రెండేళ్లకు అదే హీరోతో సింహాద్రి సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు. ఆ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈహ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు.

ఎప్పుడూ సినిమాలకు సంబంధించిన వార్తలతోనే కనిపించే ఈయన.. తాజాగా మరో వార్తతోనూ మెరిశాడు. అయితే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి కర్ణాటక రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓ బృహత్తరమైన బాధ్యతలను అప్పగించింది. రాయచూరు జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా ఆ జిల్లా కలెక్టర్ రాజమౌళిని నియమించారు. ఈ క్రమంలోనే ఉత్తర్వులు జారీ చేశారు. టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఈయన.. కర్ణాటకలోని రాయచూరులో జన్మించారు. మాన్వి తాలూకాలోని అమరేశ్వర క్యాంపు ఆయన సొంతూరు. అయితే అక్కడ ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు జిల్లా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

గత కొంతకాలంగా రాయచర్ జిల్లాలో ఎన్నికల ఓటింగ్ శాతం చాలా తగ్గిందట. దీంతో ఏం చేయాలో పాలుపోని అధికారులు… ఓటర్లలో ఓటుపై అవగాహన కల్పించే బాధ్యతను ఎవరికైనా అప్పగించాలనుకున్నారు. ఈ క్రమంలోనే టాప్ డైరెక్టర్ పేరు తెరమీదకు రాగా.. ఇదే మంచి నిర్ణయమని భావించి ఆయనను సంప్రదించారట. ఇందుకు రాజమౌళి కూడా ఓకే చెప్పారట. ప్రజల్లో ఓటుపై అవగాహన కల్పించి ఓట్ల శాతాన్ని పెంచేందుకు తన వంతు కృషి చేస్తానని.. వెల్లడించారు.

కేవలం తిరుగుతూనే కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా రాయ్ చూర్ జిల్లా ఓటర్లకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీలయినన్ని రకాలుగా… ఓటింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా తాను కూడా పని చేస్తానని వెల్లడించారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటు ఆస్కార్ అవార్డు రేసులో ఉంది.