గాన గంధర్వుడు ఎస్పీ బాలు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన గానం అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అంత మధురంగా ఉంటుంది ఆయన గాత్రం. ఆయన పాటలు పాడితే ఇక వంక పెట్టాల్సిన అవసరమే ఉండదు. ఒక గాయకుడిగానే కాకుండా.. డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడిగా బాలు ప్రఖ్యాతిగాంచారు.
నిజానికి ఎస్పీ బాలు తొలిసారి తన గాత్రాన్ని వినిపించింది 1966లో. శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న కథ అనే సినిమాకు. అప్పట్లో రికార్డింగుకు రావాలని మ్యూజిక్ డైరెక్టర్ కోదండపాణి బాలుకు చెప్పారట. పాట పాడటం కోసం ముందే రిహార్సల్స్ అన్నీ చేయించారట బాలుతో.
ఉదయమే తన ఫ్రెండ్ మురళితో కలిసి సైకిల్ పై రికార్డింగ్ స్టూడింగ్ కు బాలు వెళ్లబోతుంటే.. గేటు బయట ఉన్న సెక్యూరిటీ గార్డు బాలు, తన ఫ్రెండ్ ను చూసి లోపలికి వెళ్లనీయలేదు.
పాట పాడటానికి వచ్చాను. రికార్డింగ్ ఉంది.. నేను వెళ్లాలి అని బాలు చెబితే.. నువ్వు పాట పాడుతావా? అంటూ అదోరకంగా బాలువైపు చూశాడట సెక్యూరిటీ గార్డు. వెంటనే బాలు ఫ్రెండ్ మురళి.. లోపలికి వెళ్లి రికార్డింగ్ అసిస్టెంట్ ను తీసుకువచ్చాక గానీ.. బాలును లోపలికి వెళ్లనీయలేదట సెక్యూరిటీ గార్డు.
ఎస్పీ బాలు అలా తన సంగీత జీవితాన్ని ప్రారంభించి.. ఒక్కో మెట్టు ఎదిగి… గాయకుడిగా.. నటుడిగా.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా.. బుల్లితెర వ్యాఖ్యాతగా సినీ రంగానికి సేవలు చేసి.. తనకంటూ సంగీత అభిమానులను ఏర్పరుచుకున్నారు.