ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీకే కాదు యావత్ భారత సినీ ఇండస్ట్రీకే తీరని విషాదం ఇది. అమృత కంఠం మూగబోయింది. ప్రముఖ సినీ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు. ఆయన శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటలకు కన్నుమూశారు. ఈ విషయాన్ని బాలు కొడుకు చరణ్ వెల్లడించారు.
కరోనా వల్ల గత కొంత కాలం నుంచి చెన్నైలోని ఓ ఆసుపత్రిలో ఎస్పీ బాలు చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మధ్యలో ఆయన పరిస్థితి విషమించడం.. మళ్లీ సాధారణ స్థితికి రావడం.. ఆ తర్వాత కరోనా తగ్గడం.. అయినప్పటికీ.. తన శరీరం సహకరించకపోవడంతో మళ్లీ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో చికత్స పొందుతూనే బాలు తుదిశ్వాస విడిచారు.
ఆగస్టు 5న బాలుకు కరోనా సోకడంతో ఆయన్ను చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రికి తరించారు. అప్పటి నుంచి బాలు అక్కడే చికిత్స పొందుతున్నారు.
నాన్న మధ్యాహ్నం 1.04 గంటలకు కన్నుమూశారు. నాన్న అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాల గురించి త్వరలోనే మీడియాకు వెల్లడిస్తాం.. అని బాలు కొడుకు చరణ్ వెల్లడించారు.
ఎస్పీ బాలు మృతితో యావత్ సినీ లోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.