క‌ష్ట కాలంలో దేవుడిలా ఆదుకున్న సోనూసూద్.. ఎనిమిది ఇళ్ళు అమ్మి సాయం చేసిన రియ‌ల్ హీరో

అనుకోని విప‌త్తు వ‌చ్చిన‌ప్పుడు మ‌నిషికి మ‌నిషి సాయం చాలా అవ‌స‌రం. క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టిస్తున్న స‌మయంలో త‌ప్ప‌ని స‌రిగా లాక్‌డౌన్ విధించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. దీంతో పరిశ్ర‌మ‌లు అన్ని బంద్ అయ్యాయి. ర‌వాణా వ్య‌వ‌స్థ ఆగిపోయింది. ప్ర‌జ‌లంద‌రు ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ప‌నులు లేక‌పోవ‌డంతో ఇత‌ర రాష్ట్రాల‌కి చెందిన ప్ర‌జ‌లు కాలిబాట‌న త‌మ గ‌మ్య‌స్థానాల‌కు చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇలాంటి సమ‌యంలో దేవుడిలా వ‌చ్చిన సోనూసూద్ త‌న‌కు చేత‌నంత సాయం చేశాడు.

బ‌స్సులు, రైళ్ళు, విమానాలు ఇలా త‌న ప‌రిధిలో ఉన్న వాటిని అన్నింటిని ఉపయోగించి సాయం చేశాడు. అంతేకాక క‌రోనా వ‌ల‌న నిరాశ్ర‌యులైన వారిక ఉపాధి కల్పించాడు. కొంద‌రికి జాబులు కూడా ఇప్పించాడు. ఇప్ప‌టికీ చేతికి ఎముక లేన‌ట్టు సాయం చేసుకుంటూ వెళుతున్న సోనూసూద్ త‌న ఎనిమిది ఇళ్ళ‌ని అమ్మి అడిగిన వారికి లేద‌న‌కుండా సాయం చేస్తున్నాడ‌ట‌. 10 కోట్ల రుణానికి త‌ను క‌ష్ట‌ప‌డి కొనుకున్న ఇళ్ళ‌ను తన‌ఖా పెట్టాడు. ఇందులో కొన్ని జుహూలో ఉన్నాయి. అయితే సెప్టెంబర్‌లోనే ఈ ఆస్తులను స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకుని 10 కోట్ల రుణం తీసుకున్నాడు. వాటితోనే అన్ని సాయాలు చేసుకుంటూ పోతున్నాడు

ఇటీవ‌ల చాలా మంది విద్యార్థులకు ఫీజు చెల్లించాడు, మెడిసిన్ విద్యార్ధ‌లకు ఖ‌ర్చులు భ‌రించాడు. ఎక్క‌డ త‌న అవ‌స‌రం ఉంద‌ని తెలిస్తే వెంట‌నే ప్ర‌త్య‌క్షం అవుతూ వారి బాధ‌ల‌ని తీరుస్తూ వ‌స్తున్నాడు. సోనూ సేవ‌ల‌ని గుర్తిస్తున్న ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న‌కు స‌న్మానాలు చేయ‌డం ప్ర‌శంస‌లు కురిపించ‌డం వంటివి చేస్తున్నారు. ఆచార్య టీంతో క‌లిసిన సోనూసూద్‌ని త‌నికెళ్ల భ‌ర‌ణి రీసెంట్‌గా స‌న్మానించారు. అంత‌క‌ముందు ప్ర‌కాశ్ రాజ్ కూడా స‌న్మానించారు. ఇక సోష‌ల్ మీడియాలోను విప‌రీతంగా ఫ్యాన్ ఫాలొయింగ్ పెంచుకున్నారు సోనూ. ప్ర‌స్తుతం అత‌ను రియ‌ల్ హీరో అంటూ అభిమానుల‌చే పిలిపించుకుంటున్నాడు.