Siraj: ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో దుమ్ము రేపిన సిరాజ్.. కెరీర్ బెస్ట్ ఇదే..!

ఒకప్పుడు టీమిండియా జట్టులో స్థానమే ఉండదనుకున్న మహ్మద్ సిరాజ్… ఇప్పుడు టీమ్ ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న స్టార్ బౌలర్‌గా మారిపోయాడు. ఓవల్ వేదికగా జరిగిన ఐదవ టెస్ట్‌లో మరోసారి ఇది రుజువైంది. ఇంగ్లాండ్‌తో కీలక మ్యాచ్‌లో సిరాజ్ అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ విజయంతో పాటు అతడి బౌలింగ్ ప్రతిభకు గుర్తింపు కూడా లభించింది. తాజాగా విడుదలైన ఐసీసీ టెస్ట్ బౌలర్ ర్యాంకింగ్స్‌లో సిరాజ్ తన కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్‌ను సాధించాడు.

ఈ టెస్ట్‌లో మొత్తం 9 వికెట్లు తీసిన సిరాజ్.. మొదటి ఇన్నింగ్స్‌లో 4, రెండవ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థులను భయపెట్టాడు. ఈ అద్భుత ప్రదర్శనతో అతను 15 స్థానాలు ఎగబాకి 674 రేటింగ్ పాయింట్లతో 15వ స్థానంలోకి చేరుకున్నాడు. టెస్ట్ సిరీస్ మొత్తం 23 వికెట్లు తీసి సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా తనదైన రికార్డును నెలకొల్పాడు.

ఇక ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 889 రేటింగ్ పాయింట్లతో తన ర్యాంకింగ్‌ను కాపాడుకుంటూ కొనసాగుతున్నాడు. మరోవైపు, ఓవల్ టెస్ట్‌ మ్యాచ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ కూడా విరుచుకుపడ్డాడు. మొత్తం 8 వికెట్లు తీసిన అతను ర్యాంకింగ్స్‌లో 25 స్థానాలు ఎగబాకి 59వ స్థానంలోకి చేరాడు. ఇది అతనికి మంచి మోరల్ బూస్టర్‌గా మారింది. రానున్న టెస్ట్‌ సిరీస్‌ల్లో అతని ప్రదర్శనపై అభిమానుల్లో ఆశలు పెరిగాయి.

బ్యాటింగ్ విభాగంలో యువ బ్యాట్స్‌మన్ యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీతో రాణించాడు. దీంతో అతను టెస్ట్ బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో 3 స్థానాలు ఎగబాకి 792 రేటింగ్ పాయింట్లతో 5వ స్థానానికి చేరుకున్నాడు. ఇదే మ్యాచ్‌లో చెలరేగిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జో రూట్ 908 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు.

ఇక ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు రవీంద్ర జడేజా 408 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. ఓవల్ టెస్ట్‌లో 66 పరుగులు చేసిన ఆకాష్ దీప్ కూడా 12 స్థానాలు ఎగబాకి 62వ స్థానాన్ని అందుకున్నాడు. ఈ విధంగా ఓవల్ టెస్ట్ ఒక్క భారత్ విజయం మాత్రమే కాకుండా… పలువురు ఆటగాళ్లకు ర్యాంకింగ్స్‌లోనూ అరుదైన గుర్తింపునిచ్చింది. ముఖ్యంగా సిరాజ్, జైస్వాల్, ప్రసిద్ధ్ లాంటి యువ ఆటగాళ్ల ప్రదర్శన భారత క్రికెట్ భవిష్యత్తుపై విశ్వాసాన్ని పెంచుతోంది.