గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో సింగర్ మనోకి ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. ఇద్దరి ఆహార్యం, ఇద్దరి గొంతులు కూడా ఒకేలా ఉంటాయి. ఒకానొక సందర్భంలో మనో పాట పాడితే కూడా ఎస్పీబీ పాడారేమో అని అనుకున్నారు కూడా. కిల్లర్ సినిమాలోని ప్రియా ప్రియతమా రాగాలు అనే పాటను ఎస్పీబీ విని ఆశ్చర్యపోయారారట. తాను ఈ పాట ఎప్పుడు పాడాడని అనుకున్నారట.
అంతలా మనో బాలు వాయిస్‌ను ఇమిటేట్ చేయగలరు. అలాంటి మనో ఎస్పీబీ లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా అక్కా ఎవరే అతగాడు ఈవెంట్‌లో ఎస్పీబీకి నివాళిగా ఆయన పాడిన కొన్ని పాటలను మనో ఆలపించాడు. ఎస్పీబీ పాడిన పాటలు పాడుతూ ఎమోషనల్ అయిన మనో స్టేజ్ మీదే కుప్పకూలిపోయేంత పని చేశాడు. చిన్న పిల్లాడిలా మనో ఏడ్చేశాడు. అలాగే తన జీవితంలో ఎస్పీబీకి ఏ స్థానం ఉందో తెలిపాడు.
పద్నాలుగో యేట ఎస్పీబీ గారిని చూసే అవకాశం వచ్చింది. ఆయనే నన్ను ఇళయారాజాకు పరిచయం చేశాడు. అలా 1985లో సింగర్అయ్యాను. నాకు పిల్లను ఎవ్వరూ ఇవ్వడానికి ముందుకు రాలేదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు.. మ్యూజిషియన్ అని ఎవ్వరూ ముందుకు రాలేదు. కానీ ఎస్పీబీ గారు వస్తానంటే.. ఆయన గ్యారంటీ ఇస్తాను అనడంతో మా మామగారు అంగీకరించారు. పెళ్లికి వచ్చి గ్యారెంటీ సంతకం పెట్టారు అంటూ మనో ఎమోషనల్ అయ్యాడు. ఆయన నాకు తండ్రి, గురువు, దైవం, అన్నయ్య అంటూ కన్నీరు మున్నీరయ్యాడు.