ఎవరీ తమ్మారెడ్డి భరద్వాజ.? ఇటీవలి కాలంలో తెలుగు సినిమాకి ఆయన చేసిన సేవలేంటి.? 80 కోట్లు ఇస్తే, పది సినిమాలు తీసి మొహాన కొడతాడట.! ఎవరో ఎందుకు ఇస్తారు.? ఆయనే తీయొచ్చు కదా.? పది కాకపోతే, ఒక్కటి.!గత కొంతకాలంగా తమ్మారెడ్డి భరద్వాజ అంటే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు ఆయన ప్రముఖ దర్శక నిర్మాత. ఇప్పుడైతే, వివాదాల తమ్మారెడ్డి.!
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి దక్కుతున్న అంతర్జాతీయ ఖ్యాతి ఆయనకు నచ్చడంలేదు. అదీ అసలు సమస్య. ‘ఆస్కార్’ కోసం 80 కోట్లు ‘ఆర్ఆర్ఆర్’ బృందం ఖర్చు పెడుతోందన్నది తమ్మారెడ్డి ఆరోపణ. అంటే, ‘ఆర్ఆర్ఆర్’కి గనుక ‘ఆస్కార్’ దక్కితే, 80 కోట్లు పెట్టి ఆ అవార్డుని ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కొనుక్కుందని తమ్మారెడ్డి ముందు ముందు ఆరోపించబోతున్నారన్నమాట. ఈ స్థాయికి ఓ తెలుగు సినీ ప్రముఖుడి ఆలోచనలు దిగజారిపోయాయంటే, అది అత్యంత బాధాకరమైన విషయం.
రాజమౌళి అండ్ టీమ్ చాలా కష్టపడుతోంది.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడానికి. తద్వారా ఇండియన్ సినిమాకి, తెలుగు సినిమాకి అరుదైన గౌరవాలు దక్కుతున్నాయి.
హాలీవుడ్ ప్రముఖులు మన తెలుగు సినిమా, మన ఇండియన్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారంటే.. ముందు ముందు సినీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నట్టే. సీనియర్ సినిమా మనిషిగా తమ్మారెడ్డి ఈ పరిణామాల్ని స్వాగతించాలి. అంతేగానీ, 80 కోట్లు ఖర్చు చేస్తున్నారు.. 10 సినిమాలు తీసి మొహాన కొడతాం.. అనడమేంటి.?