Shubman Gill: కెప్టెన్‌గా తొలి టెస్ట్‌లోనే రికార్డు సృష్టించిన శుభమన్ గిల్..!

లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో యువ భారత్ జట్టు అదరగొడుతోంది. కెప్టెన్‌గా తొలి టెస్ట్ ఆడుతున్న శుభమన్ గిల్ సెంచరీతో దుమ్మురేపాడు. నాలుగో స్థానంలో క్రీజులోకి వచ్చిన గిల్ 140 బంతుల్లో 14 ఫోర్లతో అద్భుత సెంచరీ నమోదు చేశాడు. ఇది గిల్‌కు టెస్టుల్లో ఆరో సెంచరీ కావడం విశేషం.

గిల్ బ్యాటింగ్‌ను వన్డే తరహాలో ప్రారంభించి, హాఫ్ సెంచరీ తర్వాత కాస్త ఆచితూచి ఆడాడు. అంచెలంచెలుగా పరుగులు జోడిస్తూ సెంచరీ మార్క్ చేరాడు. కెప్టెన్‌గా తొలి టెస్ట్‌ ఆడుతూ శతకం బాదిన 23వ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

మ్యాచ్ విషయానికి వస్తే… కోహ్లీ, రోహిత్ లాంటి సీనియర్లు లేని పరిస్థుతుల్లో యువ జట్టు చక్కటి ప్రదర్శన కనబరుస్తోంది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్, కేఎల్ రాహుల్ శుభారంభం అందించారు. జైశ్వాల్ 101 పరుగులతో సెంచరీ బాదగా, రాహుల్ 42 పరుగులు చేశాడు. మూడో స్థానంలో వచ్చిన సాయి సుదర్శన్ అరంగేట్ర మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు.

ఆ తర్వాత గిల్, పంత్ జోడీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 359 పరుగులు చేసింది. గిల్ (127) పరుగులు, పంత్ (65) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఈ జోడీ ఇంకా నిలకడగా ఆడుతూ స్కోర్‌ను పెంచుతోంది. యువ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శనతో భారత్‌ను ముందుకు నడిపిస్తుండటంతో భారీ స్కోర్ ఆశించవచ్చు.