హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వివాదం చిలికి చిలికి గాలివానగా మారి బాలీవుడ్ పరిశ్రమలో డ్రగ్స్ కల్చర్ కోణంలోకి మళ్ళిన సంగతి తెలిసిందే. కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రెహా చక్రబర్తిని విచారణ చేయగా డ్రగ్స్ వాడకం విషయాలు బయటపడ్డాయి. దీంతో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు రంగంలోకి దిగారు. రెహాతో మొత్తం 20 మందికి పైగా బాలీవుడ్ స్టార్ల పేర్లు చెప్పినట్టు కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నార్కోటిక్స్ బ్యూరో రెహా చక్రబర్తితో పాటు ఆమె సోదరుడిని, ఇంకో 20 మందిని ఆరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. రెహా డ్రగ్స్ వాడకపోయినా సుశాంత్ కోసం డ్రగ్స్ తరలింపులో సహకరించినట్టు తెలియడంతో ఆమెను డ్రగ్స్ ఎవరు సప్లై చేసేవారు, సప్లయర్స్ నుండి స్టార్లు ఎవరెవరు మత్తు మందులు కొనుగోలు చేసేవారు అనే వివరాలను అధికారులు రాబడుతున్నారు.
ఈ విచారణలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినబడగా ఆమె పాత్రపై ఇంకా అధికారికమైన క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ కేసులో నటి సారా అలీ ఖాన్ సైతం తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కుంటోంది. ఇదిలా ఉండగా నార్కోటిక్స్ బ్యూరో అధికారులు మరిన్ని వివరాల కోసం సుశాంత్ సింగ్ ఫామ్ హౌస్‌లో విస్తృత తనీఖీలు చేపట్టారు. ఈ తనీఖీల్లో డ్రగ్స్ వాడకం జరిగినట్టు ఆధారాలు లభించాయట.
దీంతో అధికారులు సుశాంత్ ఫామ్ హౌస్‌కు తరచూ ఎవరెవరు వచ్చేవారు అనే విషయంపై దృష్టి పెట్టారు. వారి విచారణలో మరొక స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ పేరు బయటికొచ్చినట్టు వార్తలు వెలువడుతున్నాయి.
లోనావాలాలో ఉన్న సుశాంత్ సింగ్ ఫామ్ హౌస్ మేనేజర్ రాయీస్ అధికారులతో సుశాంత్ వారానికి ఒకటి రెండు సార్లు ఫామ్ హౌస్‌కు వచ్చేవాడని, అతనితో పాటు రెహా చక్రబర్తి, సారా అలీఖాన్, శ్రద్దా కపూర్ తరచూ పార్టీలకు వచ్చేవారని, నిత్యం పార్టీలు చేసుకునేవారని చెప్పినట్టు తెలుస్తోంది.
అంతేగాక వారితో పాటే డగ్స్ పెడ్లర్ అనే అనుమానంతో అరెస్టైన జైడ్ విలత కూడ పార్టీలకు హాజరయ్యేవాడని తెలిపారట. దీంతో అధికారులు ఫామ్ హౌస్ సీసీటీవీ ఫుటేజును పరిశీలించే పనిలో పడ్డారు.