శ్రావణంలో శివాలయం వెళ్తున్నారా..? ఈ తప్పులు చేస్తే పాపం చుట్టుకుంటుంది..!

భగవంతుడిలో అత్యంత సులభంగా ప్రసన్నమయ్యే దేవుడు శివుడు అని అంటారు. గంగా జలంతో అభిషేకం చేసి, కొద్దిగా బిల్వపత్రాలతో పూజించగలిగితే చాలు.. భక్తుడి జీవితాన్ని ఆనందంతో నింపుతాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసం రాగానే శివాలయాలు భక్తులతో కిటకిటలాడతాయి. పంచోపచార, షోడశోపచార పద్ధతుల్లో శివారాధన చేస్తే, శివుడు మరింత సంతోషిస్తాడని పెద్దలు చెబుతారు.

అయితే శివుడి పూజలో ఒక ముఖ్యమైన భాగం శివలింగం చుట్టూ ప్రదక్షిణ. చాలామంది భక్తులు శివలింగం చుట్టూ పూర్తి ప్రదక్షిణ చేస్తూ తప్పులు చేస్తారని జ్యోతిష్కులు చెబుతున్నారు. శివలింగం చుట్టూ ఎప్పుడూ అర్ధచంద్రాకార ప్రదక్షిణ చేయాలని పండితులు అంటున్నారు. ఎడమవైపు నుంచి ప్రారంభించి జలధారి వరకు వెళ్ళాలి. ఆ తర్వాత మళ్లీ తిరిగి రావాలి.

అంటే సగం ప్రదక్షిణ మాత్రమే చేయాలి. జలధారిని దాటితే శివుడికి కోపం వచ్చే అవకాశం ఉంది. అది పుణ్యానికి బదులుగా పాపాన్ని తెస్తుంది అని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు శ్రావణం రాబోతోంది. శివుని ఆశీస్సులు పొందాలనుకుంటే, చిన్న తప్పులు చేసి పుణ్యానికి ప్రతికూలంగా చేసుకోవద్దు. ఆలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు జాగ్రత్తగా ఈ నియమాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు.