పురుషుల కంటే స్త్రీలు ఎందుకు ఎత్తు తక్కువగా ఉంటారో తెలుసా..?

సాధారణంగా ప్రపంచంలో ఎక్కడ చూసినా.. పురుషులు, స్త్రీలకంటే పొడవుగా ఉంటారు. అయితే దీనికి కారణం ఇప్పుడు శాస్త్రీయంగా స్పష్టమైంది. ఈ భౌతిక వ్యత్యాసం వెనుక ఉన్న ప్రధానమైన జన్యుపరమైన కారకాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. పెన్సిల్వేనియాలోని గీసింగర్ కాలేజ్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కు చెందిన పరిశోధక బృందం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూడు పెద్ద ఆరోగ్య డేటాబేస్‌లను విశ్లేషించింది. ఈ పరిశోధన ఫలితంగా, పురుషులు .. స్త్రీల మధ్య సగటు ఎత్తు తేడాకు SHOX (షార్ట్ స్టేచర్ హోమియోబాక్స్) అనే జన్యువే కీలకమైనదిగా తేలింది.

సాధారణంగా పురుషులు స్త్రీల కంటే సగటుగా సుమారు 5 అంగుళాల ఎత్తుగా ఉంటారని గత అనేక అధ్యయనాలు సూచించాయి. అయితే ఈ తేడా ఎందుకు వస్తుంది అనే ప్రశ్నకు స్పష్టమైన శాస్త్రీయ ఆధారం ఇప్పటివరకు లేదు. తాజా పరిశోధనలో అమెరికా, బ్రిటన్ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు కలిసి దాదాపు 10 లక్షల మందికి పైగా వ్యక్తుల జన్యు సమాచారం (DNA డేటా)ని విశ్లేషించారు. వారి నివేదిక “ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్” అనే ప్రఖ్యాత అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమైంది.

పురుషులు XY క్రోమోజోమ్‌లను కలిగి ఉంటారు. స్త్రీలలో XX క్రోమోజోమ్‌లు ఉంటాయి. SHOX జన్యువు సాధారణంగా X మరియు Y క్రోమోజోమ్‌ల రెండింట్లోనూ ఉండే అవకాశం ఉంటుంది. అయితే, స్త్రీలలో రెండో X క్రోమోజోమ్‌లో ఉన్న SHOX జన్యువు పూర్తిగా పని చేయకపోవచ్చు లేదా క్రియాశీలంగా ఉండకపోవచ్చు. ఇది శరీర ఎదుగుదలపై ప్రభావం చూపి, స్త్రీలు పురుషుల కంటే కొద్దిగా తక్కువ ఎత్తు కలిగి ఉండే పరిస్థితికి దారితీస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఈ పరిశోధన కేవలం ఎత్తు విషయంలోనే కాకుండా, భవిష్యత్తులో లింగ ఆధారిత వ్యాధులను అర్థం చేసుకోవడంలోనూ, జన్యు స్థాయిలో చికిత్సల దిశగా ముందడుగు పడే అవకాశాన్ని కల్పిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.