సినిమాలకి శాటిలైట్ ఎఫెక్ట్

ఒకప్పుడు సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా శాటిలైట్ రైట్స్ కోసం టీవీ ఛానల్స్ ఆసక్తి చూపిస్తూ ఉండేవి. కోట్ల రూపాయిలు పెట్టుబడి పెట్టి మరీ హక్కులు సొంతం చేసుకునేవీ. ఇక హిట్ సినిమాలు అయితే మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తూ ఛానల్స్ కి లాభాలు తీసుకొచ్చేవి. ఈ కారణంగా అన్ని ఛానల్స్ మధ్య శాటిలైట్ హక్కుల కోసం పోటీ గట్టిగా ఉండేది.

అయితే గత రెండేళ్ళ నుంచి డిజిటల్ ఒటీటీ మాధ్యమాల ఆధిపత్యం ఎక్కువైంది. థియేటర్స్ లో రిలీజ్ అయిన 50 రోజుల్లోనే ఒటీటీలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో శాటిలైట్ ఛానల్స్ లో సినిమాలు చూసేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. సూపర్ హిట్ సినిమాలకి కూడా ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రావడం లేదు.

ఫెస్టివల్ సమయంలో వరల్డ్ ప్రీమియర్స్ గా ప్రదర్శించిన చిత్రాలకి కూడా టీఆర్పీ రేటింగ్స్ రాలేదు. ఈ రేటింగ్స్ ఎఫెక్ట్ తో ఇప్పుడు శాటిలైట్ రైట్స్ తీసుకోవడానికి ఛానల్స్ ముందుకి రావడం లేదు. దీంతో ఇప్పుడు రానా విరాటపర్వం సినిమా శాటిలైట్ హక్కులని ఇప్పటి వరకు ఎవరూ తీసుకోవడం లేదనేది టాక్. తాజాగా రిలీజ్ అయిన దసరా, శాకుంతలం, రామబాణం శాటిలైట్ హక్కులు కూడా ఎవరూ తీసుకోవడానికి ముందుకి రాకపోవడం విశేషం.

హాట్ స్టార్, జీ5 లాంటి సంస్థలు డిజిటల్ రైట్స్ తో పాటు శాటిలైట్ రైట్స్ కలిపి తీసుకుంటున్నాయి. వాటికి సొంతంగా టీవీ ఛానల్స్ ఉండటమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో ఇప్పుడు నిర్మాతలు కూడా శాటిలైట్ రైట్స్ పైన హోప్స్ పెట్టుకోవడం లేదు. డిజిటల్ రైట్స్ మీదనే డిపెండ్ అవుతున్నారు. ఇక ఒటీటీ సంస్థలు కూడా పెద్ద మొత్తంలో చెల్లించి హక్కులు సొంతం చేసుకుంటున్నారు.

సినిమా హిట్ అయితే 50 రోజులు, ఫ్లాప్ అయితే రెండు, లేదా మూడు వారాలలోనే ఒటీటీలో రిలీజ్ చేసుకునే విధంగా ఒప్పందం చేసుకుంటున్నారు. డిజిటల్ మాధ్యమాలలో సినిమాలు చూసేస్తూ ఉండటం వలన శాటిలైట్ ఛానల్స్ ఫెస్టివల్ ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాల మీద ఆధారపడకుండా ప్రత్యేకంగా షోలు చేసుకుంటున్నాయి.