Salman Khan: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చూసి సంచలన వ్యాఖ్యలు చేసిన సల్మాన్ ఖాన్.. మా సినిమాలు అక్కడ ఆడవెందుకు?

Salman Khan: రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టాలీవుడ్‌తోపాటు ఇతర భాషల్లోనూ దుమ్మురేపుతోన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజైన ఈ సినిమాకు చాలా చోట్ల పాజిటివ్‌ టాక్ రావడంతో మూవీ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఈ మూవీకి ఇటు తెలుగు ప్రేక్షకులే కాదు బాలీవుడ్‌ ఆడియెన్స్ కూడా జై కొడుతున్నారంటే ఏ లెవల్‌లో ఈ సినిమాకు క్రేజ్ పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి, రికార్డులను బ్రేక్ చేస్తోంది. మూవీ రిలీజ్ అయ్యి వారం రోజులు గడుస్తున్నా థియేటర్లకు ప్రేక్షకుల తాకిడి తగ్గడం లేదు. కాగా ఈ మూవీ ఇంత భారీ హిట్ కావడంతో పలు సెలబ్రెటీలు సైతం నటీనటులను, రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాను చూసి సినిమా సక్సెస్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవితో కలిసి గాడ్ ఫాదర్ అనే సినిమాలో నటిస్తున్నానని, ఆయనతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవమని సల్మాన్ కామెంట్ చేశారు. అంతే కాకుండా చిరంజీవి తనకు చాలాకాలం నుంచి తెలుసని, ఆయన తనకు మంచి స్నేహితుడు అని కూడా వ్యాఖ్యానించారు. ఇక ఆయన కుమారుడు రామ్ చరణ్‌ కూడా తనకు మంచి స్నేహితుడు అని చెప్పొకొచ్చారు.

ఇక ఇటీవల విడుదలైన RRRలో రామ్ చరణ్ అద్భుతంగా నటించాడన్న సల్మాన్ ఖాన్… సినిమా విజయం సాధించినందుకు చరణ్‌కు తన అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రామ్‌ చరణ్‌ను చూసి చాలా గర్వపడుతున్నానని ఆయన తెలిపారు. యితే ఇదే సమయంలో సల్మాన్ ఖాన్.. ఆర్ఆర్ఆర్ సహా సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రాణించడంపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం వైరల్‌గా మారింది. బాలీవుడ్‌లో సౌత్ సినిమాలు బాగా ఆడుతుంటే.. ఇక్కడి సినిమాలు మాత్రం సౌత్‌లో ఎందుకు బాగా ఆడటం లేదని ఆయన సందేహం వ్యక్తం చేశారు. సల్మాన్ చేసిన ఈ రకమైన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ట్రెండింగ్‌లో నిలిచింది.