త్వరలోనే ‘సలార్‌-2’ షూటింగ్‌

ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్‌ పార్ట్‌-1: సీజ్‌ ఫైర్‌’ గతేడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకొని కలెక్షన్ల వర్షం కురిపించింది. దేవగా ప్రభాస్‌, వరద రాజమన్నార్‌గా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తమ నటనతో విశేషంగా ఆకట్టుకున్నారు.

దీని రెండో భాగం ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ విషయంపై నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. మరికొన్ని రోజుల్లో దీని షూటింగ్‌ ప్రారంభం కానుంది. ప్రశాంత్‌ నీల్‌ చాలా జాగ్రత్తగా ప్లాన్‌ చేస్తున్నారు. ‘సలార్‌-2’ కచ్చితంగా 2025లో విడుదలవుతుంది. తేదీ మాత్రం దర్శక నిర్మాతల నిర్ణయంపై ఆధారపడి ఉంది. దీనికి సంబంధించిన కొన్ని సీక్వెన్స్‌లను పూర్తి చేయడానికి నేను ‘ఎల్‌2: ఎంపురాన్‌’ నుంచి కొన్ని రోజులు బ్రేక్‌ తీసుకోవాలి‘ అని చెప్పారు.

ఇటీవల నటుడు బాబీసింహా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘సలార్‌ పార్ట్‌2’ కథ సిద్ధంగా ఉందని.. ఏప్రిల్‌లో చిత్రీకరణను ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి వెళ్తుందని అభిమానులు భావిస్తున్నారు. పార్ట్‌ 2ను’శౌర్యాంగ పర్వం’ పేరుతో తెరకెక్కించనున్నారు. ఎన్నో ప్రశ్నలతో మొదటి భాగాన్ని ముగించిన ప్రశాంత్‌ నీల్‌.. రెండో పార్ట్‌లో వాటికి ఎలాంటి సమాధానాలు చెప్పనున్నారు.

ప్రభాస్‌ ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’లో నటిస్తున్నారు. దీని చిత్రీకరణ తుది భాగానికి చేరుకుంది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం వేసవి కానుకగా మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతోపాటు మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్‌’ లోనూ ప్రభాస్‌ నటిస్తున్నారు. రొమాంటిక్‌ హారర్‌ కామెడీ నేపథ్యంలో ఇది తెరకెక్కుతోంది. హను రాఘవపూడితో ఓ సినిమా లైనప్‌లో ఉంది.