సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు ఎన్ని మలుపులు తిరుగుతోంది, ఎంత దూరం వెళ్తోంది అన్న విషయం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ మాఫియా, నెపోటిజం దగ్గర మొదలైన ఈ కేసులో సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీ(నార్కోటిక్ కంట్రోల్ బ్యూర్)లు ఎంటరయ్యాయి. ప్రస్తుతం సుశాంత్ కేసులో ఎన్‌సీబీ ప్రముఖ పాత్ర వహిస్తోంది. డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టు చేసేందుకు అరెస్ట్‌లు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రియా చక్రవర్తి సోదరుడు షోవిక్, సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరిండాలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే అరెస్టయిన సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరాండా, డ్రగ్ డీలర్లు కైజాన్ ఇబ్రహీం, జైద్ విల్తారా, అబ్దుల్ బాసిత్ పరిహార్ వంటి వారిని విచారించారు. తన సోదరి రియా చక్రవర్తి చెబితేనే తాను మాదక ద్రవ్యాలను తీసుకొచ్చేవాడినని షోవిక్ వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. సుశాంత్‌కే కాకుండా మరికొందరు బాలీవుడ్ నటులకు కూడా మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవాడినని అతడు విచారణలో అంగీకరించాడని పేర్కొన్నారు.
ఇక ఈ తతంగం అంతటిపై రియా చక్రవర్తి తండ్రి గతంలో లెఫ్టినెంట్ కల్నల్‌గా పని చేసిన ఇంద్రజిత్ చక్రవర్తి స్పందించారు. కంగ్రాట్స్ ఇండియా, నువ్వు నా కొడుకును అరెస్టు చేశావు, ఆ తర్వాత వరుసలో నా కుమార్తె కూడా ఉందని నాకు తెలుసు. ఆ తదుపరి ఇంకెవరో తెలియదు.మొత్తానికి ఓ మధ్య తరగతి కుటుంబాన్ని సమర్థవంతంగా నాశనం చేశారు. అయితే న్యాయం జరగాలంటే వీటన్నింటినీ మనం సమర్థించాల్సి ఉంటుంది. జై హింద్ అంటూ సెటైర్ వేశారు.