బాలీవుడ్ స్టార్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 2020లో కరోనా సమయంలో తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన మరణం తర్వాత బాలీవుడ్ లో తీవ్ర విమర్శలు వచ్చాయి. అదే సమయంలో డ్రగ్స్ భాగోతం వెలుగుచూసింది. అందులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని నెలలు ఆమె జైలు జీవితం గడిపారు.
అయితే సుశాంత్ మృతి సాధారణంగా జరిగిన ఆత్మహత్య కాదని, ఇందులో కుత్రకోణం ఉందని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. సుశాంత్ చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని పేర్కొన్నారు. ఎవరైన హత్య చేయడం లేదంటే ఆత్మహత్యకి ప్రేరేపించడం జరిగి ఉంటుందని అన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ కేసుని సీబీఐకి మహారాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.
తాజాగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ కేసులో ఆరంభంలో ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే తరువాత కొంతమంది తమ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని ముందుకొచ్చారని తెలిపారు. వారి వద్ద ఉన్న సాక్ష్యాలు సీబీఐ అధికారులు సేకరించడం జరిగిందని, వాటి ప్రామాణికత ఏంటి అనేది పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత ఒక నిర్ధారణకి వస్తారని అన్నారు.
సీబీఐ దీనిపై ఇంకా విచారణ చేస్తున్న నేపథ్యంలో ఇంతకుమించి చెప్పలేనని తేల్చేశారు. అయన మరణం ఎలా జరిగింది అనేదానిపై సీబీఐ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని, పూర్తిస్థాయిలో నిజాలు బయటకి వస్తాయని అన్నట్లు తెలుస్తోంది. సుశాంత్ సింగ్ చనిపోవడానికి వారం రోజుల ముందుగానే ఆయన మాజీ మేనేజర్ దిశా సాలియన్ ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ కారణంగానే సుశాంత్ ఆత్మహత్యకి వేరే బలమైన కారణాలు ఉంటాయని, ఎవరో ప్రేరేపించడం వలన సూసైడ్ చేసుకొని ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సుశాంత్ ఆత్మహత్య బాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక మచ్చ అని చెప్పాలి. ఎన్నో అవమానాలు ఎదుర్కొని స్టార్ గా ఎదిగిన అతనికి అవకాశాలు రాకుండా సెలబ్రిటీ ఫ్యామిలీస్ అడ్డుకున్నాయని విమర్శలు వచ్చాయి. అప్పటి నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీని సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేస్తూ వస్తున్నారు.