రూమర్స్‌ను ఎదుర్కోవటం మామూలే.. పెద్దగా పట్టించుకోను: కృతిసనన్

‘‘జీవితంలో అద్భుమైన క్షణాలు ఒక్కసారే వస్తాయి. ఆ ఫీలింగ్‌ గొప్పది. ఇటీవల జాతీయ అవార్డును రాష్ట్రపతితో అందుకున్నప్పుడు కలిగిన ఆనందాన్ని వర్ణించలేను. మరాఠీ రీమేక్‌ అయిన ‘మిమి’లాంటి మహిళా ప్రాధాన్య పాత్ర ‘మిమి రాథోర్‌’ పాత్ర దొరకటం అదృష్టం. ఇందులో సరోగసి అమ్మగా నటించా. ఆ పాత్రకోసం ఎంతో కష్టపడ్డా’’ అన్నారు కృతిసనన్.

టాలీవుడ్‌లో నటిగా పరిచయమై బాలీవుడ్‌లో ఇటీవల జాతీయ అవార్డు అందుకున్న ఈ భామ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. సరోగసి అమ్మగా నటించడం కోసం ఎంతో కష్టపడ్డా. ఆ సమయంలో బాగా తినేదాన్ని. ఆకలిగా లేకున్నా బలవంతంగా తినేదాన్ని. యోగా, కసరత్తులు వదిలేశా. 15 కిలోలు బరువు పెరిగా. ఆ కష్టం ఊరికే పోలేదు. తగిన గుర్తింపు దక్కింది. మిర్చిమ్యూజిక్‌ అవార్డ్స్‌, ఐఫా, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులతో పాటు జాతీయ అవార్డు దక్కడం అరుదైన గౌరవం, ఆనందం. ఇలాంటి అమోఘమైన, ఆనందకర, మధురమైన క్షణాలు నటిగా ఇంత త్వరగా వస్తాయని అయితే ఊహించలేదు.

నేను సాధారణ అమ్మాయిని. చదువంటే ఇష్టం ఉండేది. ఇంజనీరింగ్‌ చదివా. డ్యాన్స్‌ అంటే పిచ్చి. సినిమాల్లోకి రావాలని ఉండేది. అయితే పేరెంట్స్‌ మాత్రం చదువు గొప్ప నమ్మకాన్ని ఇస్తుంది. కచ్చితంగా బిటెక్‌ చేశాక ‘నీ ఇష్టం’ అన్నారు.

దీంతో బిటెక్‌ చదువుతున్నప్పుడే మోడలింగ్‌ చేశా. ఇంట్రోవర్ట్‌ను. తక్కువగా మాట్లాడే గుణం ఉండటం వల్ల కలిసి మాట్లాడే దాన్ని కాదు. ఉద్యోగావకాశాలు వచ్చాయి. నచ్చలేదు. కాన్ఫిడెంట్‌ మాత్రం సినిమాల్లో పేరు వస్తుందని ఉండేది. ఏదోటి నేర్చుకోవాలనే తత్వం నాది. దాదాపు ఏడేళ్లకు కెరీర్‌లో కాన్ఫిడెంట్‌ వచ్చింది. ఇంత స్థాయిలోకి రావటానికి కారణం కుటుంబమే. అమ్మానాన్నల ప్రోత్సాహమే. వారివల్లనే ఇంత ఎత్తుకు ఎదిగా.

తెలుగులో ‘నేనొక్కడినే’ చిత్రంలో మహేష్‌బాబుతో కలిసి నటించే అవకాశం వచ్చింది. అదే సమయంలో టైగర్‌ష్రాఫ్‌కు జోడీగా బాలీవుడ్‌లోకి అడుగెట్టాను. ఏదైనా నేర్చుకోవాలనే ఉత్సాహం నాది. ఇండస్ట్రీలోనే నాకు జీవితం ఏంటో తెలిసింది. మిత్రులతో మెలగటం, సినిమాల కోసం స్క్రిప్టులు వినటం, బాలీవుడ్‌లో జనాలతో అడ్జస్ట్‌ అవ్వటం, పనిమీద ఏకాగ్రత, ఏదీ పట్టించుకోకుండా నా కెరీర్‌ గురించి ఆలోచించటం.. ఇలా ఇండస్ట్రీలో ఎన్నో నేర్చుకున్నా.

ఇక రూమర్స్‌ను ఎదుర్కోవటం ఇక్కడ మామూలే కాబట్టి పెద్దగా పట్టించుకోను. కొన్ని వెబ్‌సైట్స్‌ లింక్స్‌ మా పేరెంట్స్‌ షేర్‌ చేస్తుంటారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌తో ‘రాబ్తా’ చిత్రంలో నటించా. మంచి వ్యక్తి. తనను మర్చిపోలేను. షారుఖ్‌, అక్షయ్‌కుమార్‌లాంటి స్టార్‌ హీరోలతో కలసి నటించాను. రొమాంటిక్‌, కామెడీ జోనర్స్‌లో నటించా.

పానిపట్‌ లాంటి చారిత్రక చిత్రాల్లోనూ మెప్పించా. అయితే ‘మిమి’తో కెరీర్‌ మారిపోయిందనే చెప్పాలి. ఒకరకంగా కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రమది. కృతి ఇలాంటి పాత్రలు కూడా చేస్తుందని నిరూపించిన చిత్రమది. జాతీయ అవార్డూ వరించింది. ‘ఆదిపురుష్‌’తో జాతీయస్థాయిలో పేరు వచ్చింది. నాలుగైదు చిత్రాలు చేతిలో ఉన్నాయి.

ఇలా నాకోసమే మంచి కథలను రచయితలు రాసుకుని రావటం చూస్తుంటే అదృష్టవంతురాలిని అనిపిస్తోంది. మంచి నిద్ర, పేరు, స్నేహితులతో తిరగటం.. ఇంతకంటే ఏం కావాలి అనిపిస్తుంది” అంటూ చెప్పుకొచ్చింది.