సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు కాస్త మరో మలుపు తిరిగింది. అటూ ఇటూ వెళ్లి డ్రగ్స్ కేసుగా మారింది. సుశాంత్ మృతికి, డ్రగ్స్ కు సంబంధం ఉండటంతో ఎన్సీబీ అధికారులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు. అయితే అధికారులు తీగ మాత్రమే లాగితే డొంక అంతా కదిలింది.
డ్రగ్స్ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తితో పాటు రియా సొదరుడు, స్నేహితులను ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సుశాంత్ కు రియా ఆదేశాలతోనే డ్రగ్స్ ను ఇచ్చినట్టు రియా సోదరుడు అధికారుల ముందు ఒప్పుకున్నాడు. దీంతో సుశాంత్ కేసు కన్నా డ్రగ్స్ కేసును ఛేదించడం ఎన్సీబీ అధికారులకు సవాల్ గా మారింది.
అయితే.. బాలీవుడ్ లో డ్రగ్స్ దందాకు సంబంధించిన పలు సంచలన నిజాలను రియా చక్రవర్తి ఎన్సీబీ అధికారులకు తెలిపింది. బాలీవుడ్ లో ఉన్న పలువురు ప్రముఖులకు కూడా డ్రగ్స్ దందాతో సంబంధాలు ఉన్నాయని బాంబు పేల్చడమే కాదు.. వాళ్లలో కొందరి పేర్లను కూడా బయటపెట్టింది.
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ పేర్లను వెల్లడించిన రియా.. తాజాగా డ్రగ్స్ కేసుకు సంబంధించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ పేరును కూడా వెల్లడించింది.
దీంతో.. ఎన్సీబీ అధికారులు సారా అలీ ఖాన్ తో పాటు… శ్రద్ధా కపూర్ కు కూడా సమన్లు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఎన్సీబీ అధికారుల నుంచి నోటీసులు అందుకున్నాక.. శ్రద్ధా, సారా ఇద్దరు అధికారుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.