రేణూ దేశాయ్ ప్రస్తుతం ఓ సినిమాను తెరకెక్కించే పనిలో ఉందన్న సంగతి తెలిసిందే కదా. ఆ మధ్య లోకేషన్స్ వికారాబాద్ అడవుల్లో అణువణువు గాలించింది. రోల్ రైడా కూడా అప్పట్లో రేణూ దేశాయ్‌తో పాటు తిరుగుతూ లొకేషన్ల వేటలో పడ్డాడు. ఈ ప్రాజెక్ట్ కోసమే రేణూ దేశాయ్ కూడా హైద్రాబాద్‌కు మకాం మార్చేసింది. రైతు కథాంశంతో రేణూ దేశాయ్ తెరకెక్కించే ఈ సినిమా కోసం రేణూ దేశాయ్ బాగా రిసెర్చ్ చేసింది. రైతుల స్థితిగతులు, జీవన విధానం ఇలా ఎన్నింటినో పరిశోధించింది.
రేణూ దేశాయ్ తన ప్రాజెక్ట్ పనుల్లో భాగంగానే జానపద కళాకారుడు, గేయ రచయిత గోరేటి వెంకన్నను కలిసింది. తన సినిమాలో రైతులు గురించి ఓ పాట పాడమని అడిగేందుకు వెళ్లిందట. ఇక ఆయన ఇంట్లో ఓ వైపు పాటకు పునాది పడుతూ ఉంటే.. గోరెటి వెంకన్న శ్రీమతి వడ్డించిన వంటలు, ఆ ఆప్యాయతలు, ప్రేమలు, వారి జీవన విధానం చూసి రేణూ దేశాయ్ ఫిదా అయిందట. ఈ మేరకు రేణూ దేశాయ్ షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్అవుతున్నాయి.
‘ఎంతో గొప్పగా ఆదరించారు. ప్రేమ చూపించారు.. పాటల సెషన్ కోసం గోరెటి వెంకన్న గారింటికి వెళ్లాను. నా సినిమాలోని రైతుల కోసం ఆయన పాట రాయడం గౌరవంగా ఫీలవుతున్నా.. ఆయన శ్రీమతి గారు మాకు మట్టి పాత్రల్లో వండిన అన్నం పప్పు రుచికరమైన రోటీ పచ్చడిని చేసి పెట్టింది. పూలు, బొకేను గిఫ్ట్‌గా ఇచ్చే బదులు ఓ అరిటాకులో భోజనం వడ్డించారు. ఎంతో సాధారణమైన జీవితం.. చిన్న వ్యవసాయ క్షేత్రం.. కానీ వారి హృదయం చాలా విశాలమైంది.. అలా ఆదివారం మధ్యాహ్నాం వారితో గడిపి ఎంతో అనుభూతి చెందాను’ అంటూ రేణూ దేశాయ్ ఎమోషనల్ అయింది.