నిజంగానే లంచం ఇచ్చా : విశాల్‌!?

తమిళ హీరో విశాల్‌ ముంబయి సెన్సార్‌ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. తన తాజా చిత్రం ‘మార్క్‌ ఆంటోని’ హిందీ సెన్సార్‌ పనుల కోసం సంబంధిత అధికారులకు 6.5లక్షలు (3లక్షలు స్క్రీనింగ్‌ కోసం, 3.5 లక్షలు సర్టిఫికెట్‌ కోసం) లంచంగా ఇచ్చానని తెలిపారు. ముంబయి సెన్సార్‌ ఆఫీస్‌లో అవినీతి పెచ్చు మీరిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ మేరకు విశాల్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. ‘నా కెరీర్‌లో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. మరో మార్గం లేక డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. కష్టపడి సంపాదించిన డబ్బు ఇలా అవినీతికూపంలోకి వెళ్లకూడదు. నాలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఏ నిర్మాతకూ రావొద్దని కోరుకుంటున్నా. చివరకు న్యాయమే గెలుస్తుందని నమ్ముతున్నా.

ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేల దృష్టికి తీసుకెళ్తాను’ అని తెలిపారు. డబ్బులు తీసుకున్న వారి పేర్లు, బ్యాంక్‌ ఖాతా వివరాలను విశాల్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించిన ‘మార్క్‌ ఆంటోని’ చిత్రం తెలుగు, తమిళంలో విడుదల కాగా..హిందీలో గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.