మలయాళ హీరోను లైన్లో పెట్టిన రానా

ఈ మధ్యకాలంలో దాదాపుగా మన హీరోలందరూ ఒకపక్క నటిస్తూనే మరోపక్క వ్యాపారాల మీద కూడా దృష్టి పెడుతున్నారు. చాలా మంది సొంతంగా ప్రొడక్షన్ హౌస్ లో మొదలు పెట్టి తమ సినిమాలలో భాగస్వామ్యం తీసుకుంటూనే చిన్న సినిమాలను నిర్మిస్తూ చిన్న హీరోలను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఒక ఆసక్తికరమైన కాంబినేషన్ ఇలాగే తెర మీదకు వచ్చింది.

నిజానికి సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సురేష్ బాబు సినిమాలు నిర్మించడం తగ్గించారు. అయితే రానా అనారోగ్యం రిత్యా నటనకు కాస్త గ్యాప్ తీసుకోవడంతో ప్రొడక్షన్ మీద అలాగే తన గ్రాఫిక్స్ కంపెనీ వ్యవహారాల మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ మధ్యనైనా పరేషాన్ అనే సినిమాని సమర్పిస్తూ రిలీజ్ చేశారు. ఆ సినిమా డివైడ్ ఆఫ్ తెచ్చుకుంది.

కానీ ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రానా సిద్ధమవుతున్నాడని ప్రచారం జరుగుతోంది. తాజాగా జరుగుతున్న టాలీవుడ్ వర్గాల ప్రచారం మేరకు ఒక కొత్త దర్శకుడు చెప్పిన కథ రానాకు బాగా నచ్చిందని చెబుతున్నారు. అయితే ఈ కథకు ఆయన సూట్ కారని వేరే హీరోతో సినిమా చేయాలని భావిస్తున్న సమయంలో ఆ స్క్రిప్ట్ దుల్కర్ సల్మాన్ కి అయితే కరెక్ట్ గా సరిపోతుందని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

దుల్కర్ సల్మాన్ గతంలో సీతారామం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అప్పుడు ఆయనతో కనుక సినిమా చేస్తే తెలుగు, మలయాళ భాషల్లో రిలీజ్ చేయొచ్చు. తమిళంలో కూడా ఆయనకి కొంత ఫాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది. కాబట్టి తమిళనాడులో కూడా మంచి మార్కెటే ఉంది. అలా మరో రెండు భాషల్లో కూడా రిలీజ్ చేస్తే పాన్ ఇండియా స్థాయిలో కూడా రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.

ఇక ఈ స్క్రిప్టు విన్న వెంటనే రానా ఎంతగా ఎక్సైట్ అయ్యి సినిమా ఓకే చేశాడు. దుల్కర్ సల్మాన్ కూడా అంతగానే ఎక్సైట్ అయ్యి సినిమా ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారికి ప్రకటన కూడా త్వరలోనే వెలువడే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.