వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. మరోసారి సంచలనానికి తెరలేపాడు. వాళ్లది వీళ్లది కాదు ఈసారి తన బయోపికే తీస్తున్నానంటూ బాంబు పేల్చాడు. నిజానికి వర్మ ఏ సినిమా తీసినా ఆ సినిమాలో మ్యాటర్ ఉంటుందో లేదో కానీ.. ఆ సినిమాయే పెద్ద మ్యాటర్ అవుతుంది. కాంటెంపరరీ స్టోరీస్ ను పట్టుకొని ఏమాత్రం భయపడకుండా సినిమా తీసేస్తాడు వర్మ. వర్మ అంటేనే డేరింగ్ అండ్ డాషింగ్ అంటూ చెబుతుంటారు కొందరు. మరికొందరు మాత్రం వర్మను మామూలుగా తిట్టరు. ఎవరి అభిప్రాయాలు వారివి.
ఇప్పటి వరకు వాళ్ల వీళ్ల బయోపిక్ లు తీసిన వర్మ.. తాజాగా తన బయోపిక్ ను ప్రకటించాడు. అదే ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. బొమ్మాకు క్రియేషన్స్ సంస్థ వర్మ జీవితాన్ని మూడు భాగాలుగా తీయనుందని వర్మ తన ట్విట్టర్ ఖాతో పోస్ట్ పెట్టారు. తన బయోపిక్ పేరు రాము అని.. కింద క్యాప్షన్ ఎ బయోపిక్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ అంటూ పెట్టుకున్నాడు వర్మ. దానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను కూడా వర్మ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశాడు.
3 భాగాలు అంటే 3 సినిమాలు అన్నమాట. అయితే ఈ సినిమాకు దొరసాయి తేజ అనే వ్యక్తి దర్శకత్వం వహించనున్నాడట. వచ్చే నెల అంటే సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభం అవుతుందట. బొమ్మాకు మురళి ఈ సినిమాకు నిర్మాత.
మూడు పార్టుల్లో ఒక్కో పార్టు 2 గంటల నిడివితో ఉంటుందట. అంటే మూడు పార్టులు మొత్తం కలిపి 6 గంటలు ఉంటుందన్నమాట.
ఇక.. మూడు పార్టుల్లో ఆర్జీవీ వేర్వేరు ఏజ్ లో జరిగిన వేర్వేరు అంశాలను చూపిస్తారట. పార్ట్ వన్ లో తన 20 ఏళ్ల వయసులో జరిగిన అంశాలను చూపిస్తారట. ఆ ఏజ్ కు సంబంధించిన రోల్ కోసం కొత్త నటుడిని తీసుకున్నారట. పార్ట్ 2 లో కూడా వేరే నటుడినే తీసుకున్నారట. కానీ.. పార్ట్ 3లో మాత్రం రామ్ గోపాల్ వర్మే హీరోగా నటిస్తున్నాడట. అంటే పార్ట్ 3 బయోపిక్ లో తనే హీరో అన్నమాట.
రాము పార్ట్ వన్ స్టోరీ ఇదే
పార్ట్ 1 లో ఆర్జీవీ కాలేజీ రోజులు, తొలి ప్రేమలు, విజయవాడలో గ్యాంగ్ ఫైట్లు ఉంటాయి. దానితో పాటు రామ్ గోపాల్ వర్మ శివ సినిమా చేయడానికి ఎటువంటి పన్నాగాలు పన్నాడు.. అనే దానిపై పార్ట్ వన్ ఉంటుంది.
పార్ట్ 2 స్టోరీ
పార్ట్ 2 లో అండర్ వరల్డ్ తో ప్రేమాయణం ఉంటుందట. తన ముంబై జీవితం గురించి.. అక్కడ అమ్మాయిలు, గ్యాంగ్ స్టర్స్, అమితాబ్ బచ్చన్ తో ఉన్న తన అనుబంధం గురించి సినిమా ఉంటుంది.
పార్ట్ 3 స్టోరీ
పార్ట్ 3కి ది ఇంటెలిజెంట్ ఇడియెట్ అనే పేరు పెట్టాడు ఆర్జీవీ. ఇది తన ఫెయిల్యూర్స్, వివాదాలు, దేవుళ్ల పట్ల, సెక్స్ పట్ల, సమాజం మీద తనకు ఉన్న విపరీత వైఖరుల గురించి ఉంటుంది.. అంటూ ఆర్జీవీ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ తన బయోపిక్ స్టోరీని కూడా రివీల్ చేసేశాడు.