గత ఐదారు రోజుల క్రితం రకుల్ ప్రీత్ ఇమేజ్ ఎంతలా డ్యామేజ్ అయిందో అందరికీ తెలిసిందే. రియా చక్రవర్తి డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా రకుల్ పేరు వెల్లడించిందని మీడియా అల్లిన కథనాలతో ఆమె పేరు బద్నాం అయింది. ఓ రెండు మూడు రోజులు రకుల్‌పై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. ఇక డ్రగ్స్ కేసులో రకుల్ పని అయిపోయిందంటూ ఎక్కడా లేని కథనాలు వెలువడ్డాయి. కానీ తీరా చూస్తే అవన్నీ గాలి వార్తలే అని తేలిపోయాయి.
అసలు రకుల్ ప్రీత్ పేరు తమ లిస్ట్‌లో లేదని, రియా చక్రవర్తి ఎలాంటి పేర్లు చెప్పలేదని ఎన్‌సీబీ తప్పుడు వార్తలను ఖండించింది. దీంతో అందరూ రకుల్‌కు క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియాలో అందరూ రకుల్‌ను క్షమించమని ఓ క్యాంపైన్ కూడా చేశారు. అయితే రకుల్ మాత్రం శాంతించలేదని తెలుస్తోంది.
ఈ మేరకు తన పేరును బద్నాం చేయడంపై రకుల్ ప్రీత్‌సింగ్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. మాదకద్రవ్యాల కేసుకు సంబంధించి మీడియాలో తనపై వస్తున్న కథనాలు నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేసింది. మీడియాలో ప్రసారం చేయకుండా సమాచారశాఖకు ఆదేశాలు ఇవ్వాలని పేర్కొంది. మీడియా సంస్థలు స్వీయ నియంత్రణ పాటించాలని ఈ సందర్భంగా దిల్లీ హైకోర్టు సూచించింది. పిటిషన్‌ను ఫిర్యాదుగా పరిగణించి ఆయా శాఖలు చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. ఈమేరకు సమాచార, ప్రసారశాఖ, ప్రసార భారతి, ఎన్‌బీఏ, ప్రెస్‌కౌన్సిల్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.