కన్నప్ప సినిమా చూసి రజినీ కాంత్ అలా అన్నారంట.. భావోద్వేగానికి గురైన మంచు విష్ణు..!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌ కన్నప్ప.. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ముకేశ్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పౌరాణిక గాథలో దేశవాప్తంగా ఉన్న స్టార్ హీరోలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం, మోహన్ బాబు వంటి నటీనటులతో ఈ చిత్రం మరింత భారీ ప్రాజెక్టుగా మారింది.

ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు, ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. తాజాగా కన్నప్ప సినిమాని సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ చిత్రాన్ని వీక్షించారు. ఈ విషయాన్ని మంచు విష్ణు స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

విష్ణు ట్వీట్ చేస్తూ… “రజినీకాంత్ అంకుల్ ‘కన్నప్ప’ సినిమా చూశారు. తర్వాత నన్ను గట్టిగా కౌగిలించుకున్నారు. ఆయనకు సినిమా బాగా నచ్చింది. నటుడిగా ఆ హగ్ కోసం నేను 22 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. ఈ రోజు నాకు చిరస్మరణీయమైన రోజు” అని ఎమోషనల్‌గా స్పందించారు. ఈ సందర్భంగా రజినీకాంత్‌తో కలిసి దిగిన ఫోటోల‌ను కూడా ఆయన పోస్ట్ చేశారు.

ఈ నెల 27న కన్నప్ప చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే కలెక్షన్స్ పరంగా హైప్ ఏర్పడిన ఈ చిత్రం… ఇప్పుడు రజినీకాంత్ వంటి సూపర్ స్టార్ ప్రశంసలు కూడా అందుకోవడం, సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ప్రేక్షకులు ఇప్పటికే ఎంతో ఆసక్తిగా కన్నప్ప రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.