ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ చివరి మ్యాచ్‌లో గట్టి పంచ్ ఇచ్చింది. అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను వారి గడ్డపై ఓడిస్తూ సీజన్‌కి సత్తాచాటి ముగింపు ఇచ్చారు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ 33 పరుగుల తేడాతో గెలిచింది.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ, నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లకు 235 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 117 పరుగులు (64 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లు)తో సెంచరి బాదాడు. నికోలస్ పూరన్ 27 బంతుల్లో 56 పరుగులు (4 ఫోర్లు, 5 సిక్స్‌లు)తో చెలరేగాడు. తొలి వికెట్‌కు మార్ష్-మార్క్రమ్ (36) కలిసి 91 పరుగులు, మార్ష్-పూరన్ భాగస్వామ్యం 121 పరుగులుగా నిలిచింది.
లక్ష్య ఛేదనలో గుజరాత్ టాపార్డర్ తడబడింది. సాయి సుదర్శన్ (21), శుభ్‌మన్ గిల్ (35), జోస్ బట్లర్ (33) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. షారుక్ ఖాన్ 29 బంతుల్లో 57 పరుగులు (5 ఫోర్లు, 3 సిక్స్‌లు), రూథర్‌ఫోర్డ్ 22 బంతుల్లో 38 పరుగులు చేశారు. అయినా గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 202 పరుగులకే పరిమితమైంది.
లఖ్‌నవూ బౌలింగ్ విభాగంలో విలియం ఓ రూర్క్ 3 వికెట్లు, అవేశ్ ఖాన్, ఆయుష్ బదోని తలో 2 వికెట్లు పడగొట్టారు. ఆకాశ్ మహరాజ్, షాబాజ్ అహ్మద్ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో లఖ్‌నవూ సీజన్‌ను గర్వంగా ముగించగా, గుజరాత్‌ను మాత్రం కీలక సమయంలో దెబ్బతీశారు.