చిక్కుల్లో మాజీ ముఖ్యమంత్రి భార్య .. ఏమైంది !

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి భార్య, శాండిల్‌వుడ్ నటి రాధికా కుమారస్వామి చీటింగ్ కేసులో ఇరుక్కున్నారు. ఒక చీటింగ్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి నుంచి రాధిక బ్యాంక్ ఖాతాకు భారీ మొత్తంలో డబ్బు బదిలీ అయినట్టు గుర్తించిన బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెకు సమన్లు జారీ చేశారు. విచారణకు తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు.

ఈ కారణంగా   శుక్రవారం సీసీబీ ముందు హాజరయ్యారు. ఉదయం తన సోదరుడు రవిరాజ్‌తో పాటు చామరాజపేటలోని సీసీబీ కార్యాలయానికి వచ్చిన ఆమెపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. నిందితుడు యువరాజ్‌ అకౌంట్‌ నుండి పెద్దమొత్తంలో నగదు బదిలీపై రాధిక వివరణ ఇచ్చారు.

ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా చెప్పుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశ చూపి కొంత మంది యువకుల వద్ద లక్షల రూపాయలు కాజేసిన యువరాజ్ అలియాస్ స్వామి అనే 52 ఏళ్ల వ్యక్తిని సీసీబీ పోలీసులు గతేడాది డిసెంబర్‌లో అరెస్టు చేశారు. విచారణలో భాగంగా యువరాజ్ బ్యాంక్ ఖాతా నుంచి రూ.75 లక్షలు రాధికా కుమారస్వామి ఖాతాకు బదిలీ అయినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెను విచారించడానికి సమన్లు జారీ చేశారు.

ఆ తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… ఓ సినిమాకు సంబంధించి తన ఖాతాకు రూ. 60 లక్షలు జమ అయినట్లు చెప్పారు. అయితే సదరు చిత్ర బృందంతో ఎలాంటి ఒప్పందం లేకుండా నగదు జమ అయినట్లు తెలిపారు. ఆ నగదును తిరిగి వెనక్కి ఇచ్చేసానన్నారు. త్వరలో ఈడీ, ఐటీ అధికారులు కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం.