ఒకప్పుడు చంద్రబాబు నాయుడు వేరు, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు వేరు. గతంలో అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అయినా బలం వేరేగా ఉండేది. జాతీయ రాజకీయాల్లో తరచూ కలుగజేసుకుంటూ ఉండేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎళ్లవేళలా వారిని వ్యతిరేకంగా రాజకీయాలు నెరిపేవారు. దేశంలో కాంగ్రెస్ అంటే ఎవరికైతే గిట్టదో వారిని కలుపుకునిపోతూ ఉండేవారు. మమతా బెనర్జీ, జయలలిత, ఫరూక్ అబ్దుల్లా,స్టాలిన్ లాంటి లీడర్లతో చంద్రబాబుకు మంచి సంబంధాలు ఉండేవి. వారు కూడ బాబుగారి మాటలు విలువ ఇచ్చేవారు. కేంద్రాన్ని ఎదుర్కోవడంలో ఆయన సలహాలు, సూచనలను పాటించేవారు. అసలు చంద్రబాబు బుర్రలో థర్డ్ ఫ్రంట్ ఆలోచన కూడ ఉండేదని అప్పట్లో అనేవారు. దానికి తగ్గట్టే ఆయన కూడ ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని, తనంతటి రాజకీయ అనుభవం ఉన్న లీడర్ మరొకరు దేశంలోనే లేరని అనేవారు.
అయితే ఇప్పుడు ఆ మాటలన్నీ గాలిలో కలిసిపోయాయి. జాతీయ స్థాయిలో చంద్రబాబును ఎవ్వరూ గుర్తించట్లేదు. కనీసం సలహాలు కూడ అడగట్లేదు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం,కొన్నాళ్ల స్నేహం తర్వాత పొత్తు విడవడం చేసిన బాబుగారు మోదీకి వ్యతిరేకంగా కర్ణాటకకు వెళ్లి కుమారస్వామి తరపున, కలకత్తాలో మమతా బెనర్జీ కోసం ప్రచారాలు చేశారు. అన్ని చేసిన ఆయన రాష్ట్ర ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. కేవలం 23 స్థానాలకే పరిమితమై జాతీయ స్థాయిలో ప్రభను కోల్పోయారు. పక్క రాష్ట్రాల రాజకీయాల సంగతి పక్కనబెడితే ఏపీలో పార్టీని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. జగన్ గట్టిగా అనుకుంటే అసలు ప్రతిపక్ష హోదా కూడ లేకుండా పోయే స్థితిలో ఉన్నారు బాబు.
అందుకే ఇంతకుముందులా పక్క రాష్ట్రం వ్యవహారాల్లో వేలుపెట్టట్లేదు. తమది జాతీయ పార్టీ అని, తాను జాతీయ అధ్యక్షుడినని చెప్పట్లేదు. పక్క రాష్ట్రం తెలంగాణలో కనీసం కార్పొరేటర్ లెవల్లో కూడ ప్రాతినిధ్యం లేకపోవడంతో ఇకపై జాతీయ ఆధ్యక్షడినని చెప్పుకుంటే నవ్విపోతారని చెప్పట్లేదు. రాష్ట్ర వ్యవహారాల్లోనే తలమునకలై ఉన్నారు. జగన్ ను ఎలా ఢీకొట్టాలి, మిత్ర పక్షాలను ఏ విధంగా కాకా పట్టాలని ఆలోచిస్తున్నారు. అందుకే నేషనల్ పాలిటిక్స్ జోలికి పోవట్లేదు. కేంద్ర స్థాయిలో కీలకమైన అంశాలు అనేకం ఉన్నా, బీజేపీ మీద తిరగబడటానికి స్కోప్ ఉన్నా కిక్కురుమనట్లేదు. పక్క రాష్ట్రం వెళ్లి మోదీని తిట్టిపోసినందుకు ఇప్పుడు బీజేపీ దగ్గరకు కూడ రానివ్వట్లేదు. పొత్తు కోసం ఎంత ప్రయత్నిస్తే పొమ్మంటున్నారు.
అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ మీద నోరుపారేసుకోకూడదని డిసైడ్ అయ్యారు. రాష్ట్ర స్థాయిలోనే కమలనాథులను గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారు. బాబుగారి పరిస్థితిని ఇతర రాష్ట్రాల నేతలు ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. అందుకే మోదీ మీద యుద్దానికి కలిసి రమ్మని పిలవలేకపోతున్నారు. స్టాలిన్, మమతా బెనర్జీలు బాబుగారికి మంచి మిత్రులే. గతంలో చంద్రబాబు పరిస్థితి బాగున్నప్పుడు ఆయన సహాయ సహకారాలు, సలహాలు సూచనలు తీసుకున్నవారే. అయినా ఇప్పుడు మాత్రం ఆయన్ను కదిపినా ప్రయోజనం ఏముంటుంది, ఇప్పటికే కష్టాల్లో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు కెలికితే మోదీ ఆగ్రహానికి అస్సలు తట్టుకోలేరు అని జాలి చూపించి తప్పుకుంటున్నారు. జాతీయ స్థాయిలో ఎదగాలని కలలుగన్న చంద్రబాబుకు ఇది ఏమాత్రం మింగుడుపడని పరిస్థితే.