భారతీయ జనతాపార్టీని ఆరెస్సెస్ నడిపిస్తుంటుందనేది తెలిసిన విషయమే. వారి సూచనలకు, సిద్ధాంతాలకు అనుగుణంగానే బీజేపీ నేతలు పాలన సాగిస్తుంటారనేది రాజకీయవర్గాల్లో రెగ్యులర్ గా జరిగే చర్చ. ఈ క్రమంలో ఇంతకాలం మోడీని అందలం ఎక్కించిన ఆరెసెస్స్.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ను ప్రకటించబోతుందని తెలుస్తుంది.
కొంత కాలంగా ప్రధాని మోడీపై విరుచుకుపడుతున్న జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఈ మేరకు సంచలన విషయం బైటపెట్టారు. మోహన్ భగవత్ సహా, ఆరెస్సెస్ సీనియర్ నేతలంతా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉన్నారని.. వచ్చే ఎన్నికల తర్వాత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ను ప్రధానిని చేయాలనుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అటు బీజేపీలోనూ, ఇటు బీజేపీయేతర పార్టీల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి.
ఇప్పటికే పుల్వామా దాడి ప్రభుత్వ వైఫల్యమని, బీజేపీ ప్రభుత్వాలు అవినీతిమయపోయాయని.. గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న మాలిక్.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బుకు ఆశపడే ఆరెస్సెస్ లోని ఓ వర్గం మాత్రమే మోడీకి మద్దతుగా ఉందని.. అయినప్పటికీ యోగిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు ఆరెస్సెస్ ప్రయత్నిస్తోందని తెలిపారు.
ఇక పూర్తిగా హిందుత్య ఎజెండాతోనే ముందుకు పోవాలని, ఆ దిశగానే రాజకీయాలు చేయాలని భావిస్తున్న బీజేపీకి… ఈసారి షాక్ తగలబోతుందని మాలిక్ అభిప్రాయపడ్డారు. మారుతున్న సమీకరణాలతో పాటు, మారుతున్న ప్రజల ఆలోచనా విధయానం దృష్ట్యా… హిందువుల్లోని యువకులు, మహిళలు, రైతులతో సహా దేశంలోని అన్ని వర్గాలు కేంద్రంలోని బీజేపీ పాలనపై విసిగిపోయాయని తెలిపారు.
ఇక బీజేపీ తనకు తాను జాతీయవాద పార్టీగా ప్రచారం చేసుకుంటోంది అని తెలిపిన మాలిక్… అది ఒక భ్రమ అని స్పష్టం చేశారు. తమది అవినీతి వ్యతిరేక పార్టీ అని చెప్పుకునే మోడీ.. తన మిత్రుడు గౌతమ్ అదానీకి అప్పనంగా 11 విమానాశ్రయాలు ఎలా అప్పగించారని ఈ సందర్భంగా మాలిక్ ప్రశ్నించారు. ఈ సారి ఎన్నికల్లో హిందుత్వ ఎజెండా కంటే బలంగా పనిచేసే శక్తులు ఉన్నాయని… అవి నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు వ్యతిరేక విధానాలు వంటివి అని మాలిక్ అభిప్రాయపడ్డారు.