Pushpa 2: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ ప్రేక్షకుల గుండెల్లో ముద్ర వేసిన చిత్రం. విడుదలైన 40 రోజులు దాటినా కూడా ఈ సినిమా రికార్డులు తిరగరాస్తూనే ఉంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమలో ఓ మైలురాయిగా నిలిచింది. తెలుగు, హిందీ, ఇతర భాషల్లో విశేష ఆదరణ పొందుతూ 1800 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇప్పుడీ సినిమా కొత్త ప్రణాళికతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు సిద్ధమైంది.
జనవరి 17 నుంచి ఈ సినిమా 20 నిమిషాల అదనపు నిడివితో విడుదల కానుంది. ఇందులో ప్రధానమైన కొత్త సన్నివేశాలు, ఎమోషనల్ కంటెంట్, మరిన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయని సమాచారం. ఈ అదనపు కంటెంట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే, ఈసారి టికెట్ ధరలను కూడా తగ్గించారు. మల్టీప్లెక్సుల్లో టికెట్ ధరను రూ.150గా, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.112గా నిర్ణయించారు. ఈ వ్యూహం తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్‌కు మంచి ఊపును తీసుకురావడంతో పాటు, కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, పుష్ప 2 తాజా ప్రణాళికతో 2,000 కోట్ల గ్రాస్ మార్క్‌ను చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అందుకొని భారీ లాభాల్లో ఉన్న ఈ సినిమా, అదనపు నిడివితో మరింత రసవత్తరంగా మారనుంది. ఈ కంటెంట్ పునఃప్రదర్శనలో కొత్త వసూళ్లకు బాటలు వేయనుంది. ప్రస్తుతం వరల్డ్‌వైడ్ వసూళ్లు రూ. 1,800 కోట్లను దాటగా, తెలుగు రాష్ట్రాల్లో రూ. 343 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.