పుష్ప 2 హడావుడి.. ఆ సినిమాలకి డేంజరే?

బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ దూకుడు కొనసాగుతూనే ఉంది. టికెట్ ధరలు అధికంగా ఉన్నా కూడా మొదటి నాలుగు రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించడమే కాదు, పబ్లిక్ రిస్పాన్స్ కూడా పాజిటివ్ గానే ఉంది. ఇప్పటివరకు పుష్ప ప్రభావం అన్ని ఏరియాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్ వరకూ, తమిళనాడు నుంచి ఉత్తర భారతదేశం దాకా ఇదే తీరుగా కొనసాగుతుండటంతో, మిగతా చిత్రాలకు స్క్రీన్ల లభ్యత కూడా సవాల్‌గా మారింది.

ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలలో క్రిస్మస్ సీజన్ కోసం సిద్ధమవుతున్న సినిమాలకు మరింత టెన్షన్ పెరుగుతోంది. గేమ్ ఛేంజర్ రిలీజ్‌ను వాయిదా వేయడంతో క్రిస్మస్ రేసులో పలు చిత్రాలు పోటీ పడుతున్నాయి. అల్లరి నరేష్ నటించిన బచ్చల మల్లి, ప్రియదర్శి సారంగపాణి జాతకం, ఉపేంద్ర యుఐ, విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2 లాంటి సినిమాలు మంచి ఆశలతో థియేటర్లకు వస్తున్నాయి. ఈ లిస్టులో హాలీవుడ్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ కూడా ఉండటంతో స్క్రీన్ల కోసం పోటీ మరింత తీవ్రతరమవుతోంది.

ఇక డిసెంబర్ 25న నితిన్ నటించిన రాబిన్ హుడ్ గ్రాండ్‌గా రిలీజ్‌కి సిద్ధమవుతోంది. అదే విధంగా వెన్నెల కిషోర్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, విజయ్ తేరి బేబీ జాన్ వంటి చిత్రాలు కూడా థియేటర్లలో ఎంటర్‌టైన్ చేయబోతున్నాయి. అయితే, పుష్ప 2 కొనసాగింపు వసూళ్లు ఇలాగే ఉంటే ఎగ్జిబిటర్లకు ఈ సినిమాను కొనసాగించడం గ్యారంటీ అని ట్రేడ్ అనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు.

ఇప్పుడు అందరి దృష్టి ఈ క్రిస్మస్ బరిలో నిలిచే కొత్త సినిమాల మీదే ఉంది. పుష్ప ప్రభంజనం తగ్గితేనే ఈ చిత్రాలకు మంచి అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. కంటెంట్ ఆధారంగా నిలబడ్డ సినిమాలు మాత్రమే ఈ పోటీని ఎదుర్కొనే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. మరి ఈ డిసెంబర్ సీజన్‌లో ఏ సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుందో చూడాలి.