Prudvi: సోషల్ మీడియా ట్రోల్స్‌తో వేధింపు.. లీగల్ యాక్షన్ తీసుకున్న పృథ్వీ

‘లైలా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు పృథ్వీ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఊహించని రీతిలో వివాదాస్పదమయ్యాయి. సినిమా ప్రమోషన్‌లో భాగంగా చెప్పిన మాటలు రాజకీయ కోణం తెచ్చుకోవడంతో, ముఖ్యంగా వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో #BoycottLaila హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. సినిమా ప్రమోషన్ కార్యక్రమం ఇలా పొలిటికల్‌గా మారిపోవడం పరిశ్రమలోనూ చర్చనీయాంశమైంది.

ఈ వివాదం కారణంగా పృథ్వీపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు రావడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యానని, ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. హాస్పిటల్ బెడ్ నుంచే ఆయన సోషల్ మీడియా ట్రోల్స్‌పై స్పందిస్తూ, తన నెంబర్‌ను లీక్ చేసి వేధిస్తున్నారని ఆరోపించారు. కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం తగదని వ్యాఖ్యానించారు.

తాజాగా పృథ్వీ రాజ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫోన్ నెంబర్‌ను లీక్ చేసి 1800 కి పైగా కాల్స్ వచ్చాయని, తనను మానసికంగా వేధించారని వివరించారు. ఈ దాడుల వెనుక వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఉందని ఆరోపిస్తూ, ఆధారాలతో ఫిర్యాదు చేశానని తెలిపారు. ఒక వ్యక్తి అనిల్ పేరుతో తన నెంబర్ వైరల్ చేశాడని, అతడిపై కేసు నమోదు చేయాలని కోరినట్లు చెప్పారు. త్వరలో హోం మంత్రిని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు, పరువు నష్టం దావా కూడా వేయనున్నట్లు వెల్లడించారు.

ఈ వివాదం మరింత ముదురుతుందా, లేక పృథ్వీ లీగల్ యాక్షన్‌తో ట్రోలింగ్ తగ్గుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే ఉండటంతో ఈ పరిణామాలు ‘లైలా’ కలెక్షన్లపై ప్రభావం చూపుతాయా అనే ప్రశ్న కూడా ఎదురవుతోంది. ఇక విశ్వక్ సేన్ కూడా సినిమాను రాజకీయంగా చూడకూడదని విజ్ఞప్తి చేశారు.

పవన్ పిలిచిన ఈ జన్మలో రాజకీయాల్లోకి రాను || Chiranjeevi Said I Am Not Coming In To Politics || TR