ప్రీ రిలీజ్ బిజినెస్.. ఆ ఇద్దరే టాప్

సినిమా సక్సెస్ ఏ స్థాయిలో ఉంటుందో అనేది పక్కన పెడితే, ఆ సినిమాపై ఎంత బిజినెస్ జరిగింది అనే విషయం మీద స్టార్ హీరోల మార్కెట్ వేల్యూ, బ్రాండ్ ఇమేజ్ ఆధారపడి ఉంటుంది. ఎంత ఎక్కువ ప్రీరిలీజ్ జరిగితే అంత మార్కెట్ ఆ హీరోలకి ఉన్నట్లు లెక్క. టాలీవుడ్ లో హైయెస్ట్ బిజినెస్ జరిగే హీరోల జాబితా చూసుకుంటే ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, తారక్ ఉంటారు. వీరి సినిమాలకి వంద కోట్లకి పైనే ప్రీరిలీజ్ బిజినెస్ జరుగుతూ ఉంటుంది.

అయితే ఓవరాల్ గా కంటే కేవలం తెలుగు రాష్ట్రాలలోనే వంద కోట్లకి పైగా బిజినెస్ చేయగలిగే ఏకైక హీరో అంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పాలి. అయితే దర్శకులు కూడా వారి బ్రాండ్ ఇమేజ్ తో తమకంటూ ఒక మార్కెట్ సృష్టించుకుంటున్నారు. అలా హైయెస్ట్ మార్కెట్ స్కోప్ ఉన్న దర్శకుడు అంటే ఇండియన్ వైడ్ గా మొదటి స్థానంలో రాజమౌళి పేరు వినబడుతుంది.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చే సినిమాలకి అతని పేరు మీదనే వ్యాపారం జరుగుతుంది. బాహుబలి 2 మూవీపై జరిగిన వ్యాపారం అంతా మొదటి సినిమా సక్సెస్, తరువాత రాజమౌళి బ్రాండ్ వేల్యూ, తరువాత ఆర్ఆర్ఆర్ సినిమాకి కూడా అదే బ్రాండ్ వేల్యూ కారణంగా హైయెస్ట్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాలలో కూడా 224 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. నెక్స్ట్ మహేష్ బాబు సినిమాకి 400 కోట్లు జరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఇప్పుడు రాజమౌళి ఇచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ కారణంగా డార్లింగ్ ప్రభాస్ కూడా తెలుగులో హైయెస్ట్ మార్కెట్ వేల్యూ ఉన్న హీరోగా ఉన్నారు. సాహో మూవీ తెలుగు రాష్ట్రాలలో 124 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. సాహో తెలుగులో ఎవరేజ్ పడటంతో రాధేశ్యామ్ ప్రీరిలీజ్ బిజినెస్ 105 కోట్ల వరకు జరిగింది. అయితే రాధేశ్యామ్ లాంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చే సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ డీల్స్ తక్కువకి వెళ్ళే అవకాశం ఉంటుందని అందరూ భావిస్తారు.

అనూహ్యంగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఏకంగా ఆదిపురుష్ తెలుగు స్టేట్స్ రిలీజ్ రైట్స్ కోసం 170 కోట్లతో డీల్ కుదుర్చుకుంది. హీరోల పరంగా చూసుకుంటే టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్ అని చెప్పాలి. ఈ సినిమా హిట్ అయితే మాత్రం సలార్ ప్రీరిలీజ్ బిజినెస్ 200 కోట్లు కేవలం తెలుగు స్టేట్స్ లోనే దాటిపోయే అవకాశం ఉందని చెప్పొచ్చు. మొత్తానికి రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ ని బీట్ చేయడానికి ప్రభాస్ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడనే మాట వినిపిస్తోంది.