ఎన్టీయార్‌దే ఆలస్యం.! ప్రశాంత్ నీల్ రెడీ.!

యంగ్ టైగర్ ఎన్టీయార్ కొత్త సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన సినిమా అది. సినిమా గతంలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంది. అయితే, కాస్త హంగు ఆర్భాటంతో ఇంకోసారి ప్రారంభోత్సవం చేయాలనుకున్నారు.. ఇంతలో తారకరత్న హఠాన్మరణంతో.. ఆ వేడుక కాస్త వాయిదా పడాల్సి వచ్చింది.

కొరటాల శివ సినిమా అంటే, ఒక్కసారి పట్టాలెక్కాక.. ఎక్స్‌ప్రెస్ వేగంతో నిర్మితమైపోతుంది. కానీ, గతంలో పరిస్థితులు వేరు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీయార్ ఇమేజ్ వేరు. ఎన్టీయార్‌ని ‘గ్లోబల్ స్టార్’గా చూస్తున్నారంతా. దాంతో, కొరటాల తీయబోయే సినిమా ఎలా వుంటుంది.? అన్నది కాస్త ఉత్కంఠగా మారింది.

ఇంకోపక్క, ప్రశాంత్ నీల్ ‘సలార్’ ప్రాజెక్టుని పూర్తి చేసేస్తున్నాడు. ఓ మూడు నెలల్లో మొత్తంగా సినిమా పని పూర్తయిపోతుందట. ఆ తర్వాత పూర్తిగా ఎన్టీయార్‌తో చేయబోయే సినిమా మీద ఫోకస్ పెడతాడు. అప్పటికల్లా ఎన్టీయార్ ఎంతవరకు కొరటాల శివ సినిమా పూర్తి చేస్తాడన్నది అనుమానమే.

‘ప్రశాంత్ నీల్ రెడీ.. ఎన్టీయార్‌దే ఆలస్యం..’ అన్న పరిస్థితి రాకూడదంటే, ఎన్టీయార్ – కొరటాల ప్రాజెక్టులో ఒకింత వేగం తప్పనిసరి. కానీ, అది సాధ్యమయ్యేలా కనిపించడంలేదు.