అందాల తారగా తెలుగు సినిమాలలో తనదైన ముద్ర వేసిన కథానాయికగా ప్రణీతను చెప్పుకోవచ్చు. ‘అత్తారింటికి దారేది’, ‘రభస’, ‘డైనమైట్’, ‘బ్రహ్మోత్సవం’.. వంటి పలు సినిమాలలో కథానాయికగా అలరించిన ఈ కన్నడ భామ గత కొన్నాళ్లుగా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
ప్రస్తుతం రెండు, మూడు హిందీ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ తరుణంలో ఈ ముద్దుగుమ్మకు ఓ తెలుగు సినిమాలో తాజాగా అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. ప్రముఖ కథానాయకుడు రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ పేరుతో తాజాగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే.
ఇందులో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో కొనసాగుతోంది. ఇక ఈ చిత్రంలో ఓ స్పెషల్ ఐటమ్ సాంగు వుందట. ఈ పాటకోసం ప్రణీతను సంప్రదించగా, ఆమె ఓకే చెప్పినట్టు తాజా సమాచారం. త్వరలోనే ఈ పాటను రవితేజ, ప్రణీతలపై చిత్రీకరిస్తారని అంటున్నారు.