టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి పరిచయమే అక్కర్లేదు. లాక్‌డౌన్‌లో కరోనా గురించి ఎన్ని వార్తలు వచ్చాయో ప్రగతిపై అంతకు మించి వచ్చాయి. డ్యాన్సులు, లుంగీ కట్టి వేసిన మాస్ట్ స్టెప్పులు, కరణం మల్లీశ్వరీలా మారి బరువులు ఎత్తి.. వర్కౌట్లు చేయడం ఇలా చెప్పుకుంటూ పోతే ఓ కొత్త ప్రగతిని అందరూ చూశారు. తెరపై కనిపించే అత్త, అమ్మ పాత్రల్లా కాకుండా కొత్త కోణంలో కనిపించింది.
యంగ్ హీరోయిన్లకు కూడా పోటీ ఇచ్చే అంత అందంగా తయారవుతోంది. నాలుగు పదుల వయసు దాటినా సరే వన్నెతగ్గని అందం తనది. ఇంకా తన ఫిట్నెస్‌కు పదును పెడుతూ నిత్యం వర్కౌట్లతో బిజీగా ఉంటుంది. ఈ మధ్యే మళ్లీ రొటీన్ లైఫ్‌కు వచ్చినట్టు కనిపిస్తోంది. అయితే చాలా గ్యాప్ తరువాత సెట్స్, షూటింగ్ వెళ్లాలంటే ఏదోలా ఉందని చెప్పుకొచ్చింది.
ఇక తాజాగా ప్రగతి జిమ్‌లో చెమటోడ్చుతున్న వీడియోలను షేర్ చేసింది. భారీ వర్కౌట్లు చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. తనను చూసి ఎంతో మంది స్ఫూర్తిపొందుతున్నారని, అందుకే తాను ఇంకా ముందుకు దూసుకుపోతున్నాని పేర్కొంది. ఆ మధ్య ప్రగతి ఇచ్చిన ఇంటర్వ్యూ, అందులో తన వ్యక్తిగత జీవితం గురించి వెల్లడించిన విషయాలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. చిన్న తనం నుంచి డ్యాన్సులు, ఫిట్‌గా ఉండటం అంటే తనకు ఇష్టమని పేర్కొన్న విషయం తెలిసిందే.