త్వరలో ప్రారంభం కాబోయే బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాన్ని ఆధారంగా చేసుకొని వండిన వార్త ఇది.
బిగ్ బాస్… అబ్బబ్బ ఏం క్రేజ్. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఏనోట చూసినా ఈ షో గురించే చర్చ. ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా? ఎప్పుడెప్పుడు టీవీలకు అతుక్కుపోవాలా? అన్నంత ఆతృతతో బిగ్ బాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
దీని కంటే ముందు మనం ఇంకో మాట మాట్లాడుకోవాలి.. ఒక ఇల్లును అద్దెకు తీసుకొని ఓ పది మంది అబ్బాయిలను, పది మంది అమ్మాయిలను అదే ఇంట్లో నెలల కొద్దీ ఉంచితే ఏమౌతుంది? అది వ్యభిచార గృహం అవుతుంది. ఏదో ఒకరోజు పోలీసులు వచ్చి ఆ గుట్టును రట్టు చేస్తారు. అంతే కదా..
మరి.. సేమ్ టు సేమ్.. ఓ పది పదిహేను మంది సెలబ్రిటీలను తీసుకెళ్లి ఓ ఇంట్లో బంధించి.. వాళ్ల చుట్టూ కెమెరాలు పెట్టి.. వాళ్లను ఆ ఇంట్లోనే నెలల తరబడి ఉంచితే దాన్ని ఏమంటారు.. ప్రస్తుతం దాన్నే బిగ్ బాస్ షో అంటున్నారు.
అంటే.. ఆ షోకు, పైన మనం చెప్పుకున్న గృహానికి పెద్ద తేడా లేనట్టు అనిపిస్తున్నది కదా.
ఈ షో ఖచ్చితంగా వచ్చే తరాలకు ఏం చెబుతున్నద అంటే.. సహజీవనం అనే విష సంస్కృతి వైపు వెళ్లాలంటూ సూచిస్తున్నది. ఇప్పటికే యువతీయువకులు డేటింగ్ లు, సహజీవనాల పేరుతో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ షో వల్ల ఆ సంస్కృతి ఇంకా పెరిగే ప్రమాదం ఉంది.
ఇంతకీ ఈ బిగ్ బాస్ ఎక్కడి నుంచి వచ్చాడు.. అసలు ఇండియాలో ఎందుకు ప్రవేశించాడు. హిందీలో ప్రారంభం అయిన ఈ బిగ్ బాస్ షో.. అన్ని రీజనల్ భాషల్లోకి కూడా విస్తరించేలా ఏమున్నది దీంట్లో. అన్ని భాషల్లోనూ ఈ షోను చూడటానికి జనాలు ఎందుకు ఎగబడుతున్నారు.
ఎందుకంటే.. ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన కుటుంబ వ్యవస్థ కలిగిన భారత్ లో ఆ కుటుంబ వ్యవస్థను, భారతదేశ సంప్రదాయాలను నాశనం చేయడానికే వచ్చాడు ఈ బిగ్ బాస్.
ఎంతో మంది విదేశీయులు భారతదేశ కుటుంబ వ్యవస్థను గౌరవిస్తారు.. ఆచరిస్తారు. కానీ.. ఈ బిగ్ బాస్ వచ్చి.. వెస్టర్న్ కల్చర్ ను భారతీయులకు అలవాటు చేస్తున్నాడు.
కానీ.. మనం మాత్రం షోను రోజూ కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని చూస్తున్నాం. మన తరాన్నే కాక.. రాబోయే తరాన్ని కూడా నాశనం చేస్తున్నాం.
పెళ్లయిన వాళ్లు, పెళ్లి కాని వాళ్లు అందరూ కలిసి నెలలకు నెలలు ఒకే ఇంట్లో ఉండటమేంటి.. ఆ డ్రెస్సులు ఏంటి? ఇకఇకలు ఏంటి? పకపకలు ఏంటి? ఆ కౌగిలించుకోవడాలు ఏంటి? మన భారతదేశ సంప్రదాయంలో ఇలాంటివి ఎక్కడైనా ఉన్నాయా? మన భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను ఇలాగే మన చేతులారా మనమే నాశనం చేసుకుందామా? ఆలోచించండి.. ఇలాంటి పాశ్చాత్య దేశాల అలవాట్లు ఉన్న షోలు మనకెందుకు.
మేలుకుందాం.. మన కుటుంబాలకు మనం కాపాడుకుందాం. ఏమంటారు…