మలయాళంలో తనదైన మార్క్‌తో గుర్తింపు సంపాదించుకున్న హీరో ఉన్ని ముకుందన్ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నాడు. ఇటీవల భారీ విజయం సాధించిన ‘మార్కో’ మూవీతో మలయాళం నుంచి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన ఈ యాక్షన్ హీరోపై ఇప్పుడు క్రిమినల్ కేసు నమోదైనట్టు సమాచారం. అతని వ్యక్తిగత మేనేజర్ విపిన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఒక వేరే హీరోను సోషల్ మీడియాలో పొగిడినందుకే ఉన్ని ముకుందన్ కోపంతో దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు.
విపిన్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నప్పటికీ, ఉన్ని ముకుందన్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. దాడికి సంబంధించి పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఉన్ని ముకుందన్‌ను అరెస్టు చేస్తారా లేదా వివరణ కోరతారా అనే అంశం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇక సినిమాల విషయానికి వస్తే, గత ఏడాది డిసెంబర్ 20న మలయాళంలో విడుదలైన ‘మార్కో’ మూవీ అక్కడ బ్లాక్‌బస్టర్‌గా నిలవగా, జనవరి 1న తెలుగులో కూడా విడుదలైంది. ఇటీవలే ఈ సినిమా సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కావడంతో, తెలుగులో మాత్రం మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. విమర్శకుల ప్రశంసలతో పాటు కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ‘మార్కో’ మూవీ మలయాళంలోనే 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తొలి ‘ఏ’ రేటింగ్ మూవీగా నిలిచింది. ప్రస్తుతం ఉన్ని ముకుందన్ రెండు మూడు ప్రాజెక్టులలో నటిస్తున్నట్టు సమాచారం. ఈ కేసు పరిణామాలపై స్పష్టత వచ్చేంత వరకు సినీ అభిమానులు వేచి చూడాల్సిన పరిస్థితి.