ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్థాన్ భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 29 ఏళ్ల తర్వాత పాక్ ఆతిథ్యం ఇస్తున్న ఐసీసీ ఈవెంట్ కావడంతో పునరుద్ధరించిన స్టేడియాలు, కట్టుదిట్టమైన భద్రతతో టోర్నీని నిర్వహిస్తోంది. లాహోర్, కరాచీ, రావల్పిండి స్టేడియాలను పూర్తి స్థాయిలో మెరుగుపరచి ప్రేక్షకులకు సౌకర్యాలను పెంచింది. ముఖ్యంగా ఈ మూడు ప్రధాన నగరాల మధ్య ప్రయాణాల కోసం ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్లు అందుబాటులో ఉంచింది.
ఈసారి టోర్నీ హైబ్రిడ్ మోడ్‌లో జరుగుతోంది. మొత్తం 8 జట్లు రెండు గ్రూపులుగా విభజించబడి పోటీపడనున్నాయి. పాక్‌లోనే ఎక్కువ మ్యాచ్‌లు జరుగుతుండగా, దుబాయ్‌లోనూ కొన్ని మ్యాచ్‌లు జరుగుతాయి. భారత జట్టు తమ లీగ్ మ్యాచ్‌లన్నింటినీ దుబాయ్ వేదికగా ఆడనుంది. ఇక టోర్నీ ఈరోజు ప్రారంభమవగా, మార్చి 9న ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. ఈ రోజు కరాచీ వేదికగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి.
భద్రత పరంగా పాక్ ఎటువంటి పొరపాటుకు తావు లేకుండా అన్ని చర్యలు తీసుకుంది. టోర్నీ కోసం 18 మంది సీనియర్ ఆఫీసర్లు, 54 డీఎస్పీలు, 135 ఇన్‌స్పెక్టర్లు, 1,200 మంది సబ్ ఆర్డినేట్లు, 10,556 కానిస్టేబుళ్లు కాపలా ఉన్నారు. వీటితో పాటు 200 మంది మహిళా పోలీసులను కూడా భద్రత కోసం నియమించారు. ఆటగాళ్లు, అధికారుల కోసం ప్రత్యేక ఎస్కార్ట్ టీంలు ఏర్పాటు చేశారు.
పాక్ క్రికెట్ బోర్డు (PCB) టోర్నీ విజయవంతం చేసేందుకు ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఆటగాళ్ల భద్రత కోసం అన్ని హోటళ్లలో ప్రత్యేక సెక్యూరిటీ ఆరేంజ్‌మెంట్లు చేసారు. స్టేడియం లోపల, బయట క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కరాచీ, లాహోర్, రావల్పిండి స్టేడియాల్లో వీవీఐపీ లాంజ్‌లు, మీడియా బాక్స్‌లు, ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు.
ఐసీసీ ఈవెంట్ జరగడం పాక్‌కు గౌరవమైనప్పటికీ, ఇది భారీ సవాల్ కూడా. గతంలో పాక్‌లో జరిగిన అనేక భద్రతా సమస్యల నేపథ్యంలో ఈ సారి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పీసీబీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. టోర్నీ మొత్తం సాఫీగా పూర్తవుతుందా, భారత్-పాక్ మ్యాచ్‌ల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతాయా అనేది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.