సాధారణంగా ఏపీ రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు ప్రవేశిస్తారనే విషయం మీద టాలీవుడ్ వర్గాల్లో ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన కుమారుడిని రంగంలోకి దింపుతారని విషయం తేటతెల్లమైంది. చంద్రబాబు చేయాల్సిన పాదయాత్ర లోకేష్ చేయిస్తున్నప్పుడే.. చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలు కూడా నారా లోకేష్కే అనే విషయం మీద కొంత క్లారిటీ వచ్చినట్లు అయింది.
ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ను కావాలనే పార్టీకి దూరంగా ఉంచుతున్నారని చాలా రోజుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో నేరుగా చంద్రబాబుకి జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకుని ఆయనకు పార్టీ పగ్గాలు ఇవ్వాలని కొంతమంది యూత్ సలహాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్నిచోట్ల చంద్రబాబు పర్యటనలను మీటింగులను కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అడ్డుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి.
అయితే నారా లోకేష్ కే ఇలాంటి ప్రశ్న ఎదురైతే ఆయన ఎలా స్పందిస్తాడు. ఇలాంటి ప్రశ్న ఎదురైనప్పుడు సాధారణంగా ఆయన దాటవేసే ప్రయత్నం చేస్తాడేమో అనుకుంటారు. కానీ లోకేష్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించాడు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎవరు వస్తామన్న నూటికి నూరు శాతం ఆహ్వానిస్తామంటూ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి.. ఆంధ్రులు గర్వంగా బతకాలి.. అని కోరుకునే వారు ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చు అంటూ నారా లోకేష్ కామెంట్లు చేశారు.
వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి గతంలో ప్రచారం కూడా చేశారు. 2009 ఎన్నికల ముందు ఆయన తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ రోడ్డు ప్రమాదం తర్వాతే ఆయన రాజకీయాల వైపు చూడడం తగ్గించారు. అయితే కొడాలి నాని పార్టీ మారిన సందర్భంలో ఒకసారి ఆయన ప్రెస్ మీట్ పెట్టి.. కొడాలి నాని పార్టీ మారినంత మాత్రాన తాను పార్టీ మారినట్లు కాదని తన తాత పెట్టిన పార్టీకి ఎప్పుడు అవసరం ఉన్నా దాని వెళ్లి అండగా నిలబడతానని కామెంట్లు చేశారు.