IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటేనే ఆటగాళ్లకు తమ ప్రతిభ చాటుకునే అద్భుతమైన అవకాశం. అయితే, ఇందులో అవకాశాలు, డబ్బు మధ్య సమతుల్యం పాటించడమే పెద్ద విషయంగా మారింది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన నితీష్ కుమార్ రెడ్డి, తన ప్రతిభతో ఫ్రాంచైజీకి కీలక ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. ఐపీఎల్ 2023లో సత్తా చాటిన నితీష్.. ఈసారి వేలంలోకి వెళ్లకుండా సన్‌రైజర్స్‌ను ఎంచుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
నితీష్‌ను సన్‌రైజర్స్ రూ.6 కోట్లకు రిటైన్ చేయగా, అతను వేలంలో ఉంటే కనీసం రూ.15 కోట్లు పలికేవాడని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, నితీష్ తెలుగునాట క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫ్రాంచైజీనే ఎంపిక చేసుకోవడం అతని లోకల్ ఫీలింగ్‌కు నిదర్శనం. తనకిచ్చిన తొలి అవకాశం గురించి నితీష్ మాట్లాడుతూ, “సన్‌రైజర్స్ నాకు మొదటి అవకాశం ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల అభిమానులు చూపించిన ప్రేమకు నేను ఎప్పటికీ కృతజ్ఞుడ్ని. వేరే జట్టుకు వెళ్లడం నా మనసుకు నచ్చలేదు” అని వెల్లడించాడు.
వేలం కంటే విలువను ఎంచుకున్న నితీష్ నిర్ణయం ఐపీఎల్‌లో అరుదుగా కనిపించే ఒక ఉదాహరణ. చాలా మంది ఆటగాళ్లు పెద్ద ధరకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. కానీ, నితీష్ తన ఫ్రాంచైజీతోనే ఉండడాన్ని ఇష్టపడ్డాడు. ఇది సన్‌రైజర్స్‌ను మరింత బలమైన జట్టుగా మలచడానికి కారణమైంది. ఒక క్రికెటర్ నుంచి ఇలాంటి నిబద్ధత చూసి సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ అతనిపై మరింత నమ్మకంతో ఉంది.
నితీష్ నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు కురుస్తున్నాయి. “సన్‌రైజర్స్‌తోనే కొనసాగాలన్న అతని ఆలోచన నిజంగా గొప్పది. ఈ నిర్ణయం ఆయన నిజాయితీని ప్రతిబింబిస్తుంది” అని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్‌లో ఆడడం కేవలం డబ్బు కోసం కాదు, మొదటి అవకాశం ఇచ్చిన SRH పై కృతజ్ఞత చూపడం, అభిమానులతో ఉన్న అనుబంధాన్ని కూడా మెరుగుపరచడం అవసరమని నితీష్ తన చర్యల ద్వారా చూపించాడు. అతని నిబద్ధత, ప్రతిభ, ధోరణి అతన్ని తక్కువ కాలంలోనే ఐపీఎల్‌లో ఒక ప్రత్యేక స్థానానికి చేర్చింది. రాబోయే సీజన్లలో నితీష్ ఇంకా ఎత్తుకు ఎదిగి, సన్‌రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాడని అభిమానులు నమ్ముతున్నారు.

