చమ్మక్ చంద్ర అంటే మనందరికి జబర్దస్త్ షో, లేడీ గెటప్స్ గుర్తుకు వస్తాయి. అయితే ఇప్పుడు అదిరింది షోలో కామెడీని పండిస్తున్నాడు. జబర్దస్త్‌ను వీడిన నాగబాబు వెంట చంద్ర కూడా వెళ్లిపోయాడు. అయితే చంద్ర ఎక్కడున్నా తన నవ్వులు, పంచ్‌లతో బాగానే నెట్టుకొస్తాడు. అయితే జబర్దస్త్ ఆర్టిస్ట్‌లందరిలో కెల్లా చమ్మక్ చంద్రనే ఎక్కువ సంపాదించాడని, ముందుగా సెటిల్ అయ్యాడని అందరూ అంటారు. తాజాగా చంద్ర ఆర్థిక స్థోమత గురించి నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.
నాగబాబు ఈ మధ్య వరుసగా కొన్ని వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్నాడు. డబ్బు గొప్పదనం, డబ్బు సంపాదించే మార్గం, డబ్బు పట్ల మనకుండాల్సిన అభిప్రాయం ఇలా ఎన్నో మంచి మాటలను, స్ఫూర్తిని కలిగించే మాటలు చెబుతున్నారు. తలుచుకుంటే ఎవ్వరైనా సరే కోటీశ్వరులు కాగలరు అంటూ కొన్ని జీవిత అనుభవాలను చెప్పుకొచ్చాడు. ఒకవేళ ప్లానింగ్ అంటూ లేకపోతే ఎంత ధనవంతులైనా సరే ఫెయిల్ అవుతారని తెలిపాడు.
ఓ ప్లానింగ్‌తో వెళ్లేవాడు, క్రమశిక్షణ కలిగిన వారు గొప్ప స్థాయికి వెళ్తారని నాగబాబు తెలిపాడు. అందుకు ఉదాహరణగా చమ్మక్ చంద్ర గురించి చెప్పాడు. జబర్దస్త్ ఆర్టిస్ట్‌లకు మొదటగా ఏమీ ఉండేది కాదు.. కానీ ఇప్పుడు అందరూ బాగానే సెటిల్ అయ్యారు. ఇక మా అదిరింది షోలో చేసే చంద్ర అందరి కంటే ఎక్కువగా సెటిల్ అయ్యాడు. ఆయన ఇళ్లు దాదాపు 80 లక్షల నుంచి కోటి విలువ చేస్తుంది. అన్ని సౌకర్యాలతో విలాసవంతంగా ఉంటుంది. ఓ బీఎండబ్ల్యూ కార్ కూడా ఉంది. చంద్ర ఓ ప్లానింగ్‌తో వెళ్లాడు కాబట్టి అందరి కంటే మంచి స్థాయిలో ఉన్నాడని అసలు విషయాన్ని చెప్పాడు.