శేఖర్ కమ్ముల సినిమా అంటేనే సున్నితమైన భావోద్వేగాల మిలితం. ఆయన సినిమాలు మొదటి నుంచి కూడా అదే పద్దతిలో ఉంటాయి. మనిషిలో ఉండే భావోద్వేగాలు, చంచలమైన మనస్తత్వం, ప్రేమ, రాగద్వేషాలతో కూడుకున్న చిత్రాలనే తెరకెక్కిస్తాడు. ఫిదా సినిమాతో మరోసారి శేఖర్ కమ్ముల మ్యాజిక్ చేసేశాడు. మనిషిలో భిన్న మనస్తత్వాలు, ప్రేమలో కలిగే అలజడులు, అపార్థాలతో తెరకెక్కించిన ఫిదా అందరినీ కట్టి పడేసింది.
అందులో ముఖ్యంగా సాయి పల్లవి చేసిన అద్భుతం అంతా ఇంతా కాదు. సినిమా మొత్తాన్ని తన భుజాల మీదే మోసేసింది. అందుకే మరో సారి అలాంటి ఓ గొప్ప బాధ్యతను శేఖర్ కమ్ముల సాయి పల్లవికి ఇచ్చాడు. నాగ చైతన్యతో సాయి పల్లవిని జత చేసిన లవ్ స్టోరీ అనే కూల్ మూవీని తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. ఏయ్ పిల్ల అనే పాట, పోస్టర్లు, నాగ చైతన్య ప్రపంచం అంటూ విడుదల చేసిన గ్లింప్స్ ఇలా ప్రతీ ఒక్కటీ ఆకట్టుకున్నాయి.
తాజాగా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో నాగ చైతన్య సాయి పల్లవిల కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో ఉండేలా కనిపిస్తోంది. ఉద్యోగాల కోసం కష్టపడే యువకుల పాత్రలో ఈ ఇద్దరూ కనిపించనున్నారు. ఇక టీజర్ చివర్లో సాయి పల్లవి ఎమోషనల్‌గా.. ఏందిరా ఒదిలేస్తవరా నన్ను అని అనడం, దానికి నాగ చైతన్య ఇచ్చిన రియాక్షన్ కథలోని లోతును తెలియజేస్తుంది. మొత్తానికి లవ్ స్టోరీతో మ్యాజిక్ చేసేందుకు శేఖర్ కమ్ముల రెడీ అయ్యాడు.