ప్రమోషన్లు తక్కువగా చేసినా, కంటెంట్ మీద నమ్మకంతో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన సినిమా ‘తుడరుమ్’. మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్, విడుదలైనప్పటి నుంచి అంచనాలను దాటి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం, నెమ్మదిగా స్టార్ట్ అయినా, మౌత్ టాక్‌తో దూసుకెళ్లింది.
తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్‌లాల్‌తో పాటు శోభన, ఫర్హాన్ ఫాసిల్ వంటి టాలెంటెడ్ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. సీరియస్ క్రైమ్ నేపథ్యంతో, థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ చిత్రం తొలి వారంలోనే కేరళలో 20 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మూడు రోజుల్లో దేశీయంగా 28 కోట్లు, ఓవర్సీస్‌లో 41.5 కోట్లు సంపాదించింది.
ఇప్పుడు 16 రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరి మరో అరుదైన రికార్డు ముద్రించుకుంది. ఇదే ఏడాదిలో మోహన్‌లాల్‌కి ఇది రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. మార్చిలో వచ్చిన ‘ఎంపురాన్’ రూ.268 కోట్ల గ్రాస్‌తో భారీ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో మోహన్‌లాల్ 2025లో ఇప్పటి వరకూ రూ.443 కోట్ల వసూళ్లను సొంతం చేసుకున్నాడు. కేరళలో ‘2018’ మూవీ (రూ.89.40 కోట్లు) రికార్డును దాటేసి, హయ్యస్ట్ గ్రాస్ కలెక్షన్ సాధించిన మలయాళ చిత్రంగా నిలిచింది. అంతేకాదు, ఒక్క నెల వ్యవధిలోనే మోహన్‌లాల్ రెండు భారీ హిట్స్‌ను అందుకున్న ఏకైక సౌత్ స్టార్‌గా రికార్డు సృష్టించాడు.