Aurora: వాతావరణ అంచనాల్లో విప్లవం తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్ ‘అరోరా’

ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, వాటిని ముందే గుర్తించే సాంకేతికతపై దృష్టి పెరిగింది. ఈ అవసరాన్ని తీర్చే దిశగా మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన నూతన ఏఐ టూల్ ‘అరోరా’ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పర్యావరణ, వాతావరణ అంశాలను వేగంగా, ఖచ్చితంగా అంచనా వేసే సామర్థ్యం దీనికి ఉంది.

అరోరా అనే ఈ ఫౌండేషన్ మోడల్‌కు ఉపగ్రహ డేటా, రాడార్ సమాచారం, వాతావరణ చరిత్ర వంటి వన్ మిలియన్ గంటల సమాచారం ఆధారంగా శిక్షణ ఇచ్చారు. ఇదే తరహాలో ఇంత భారీ డేటాతో శిక్షణ పొందిన మొదటి ఏఐ మోడల్‌గా అరోరా నిలిచింది. దీని పనితీరు ఇతర ఆధునిక నమూనాలతో పోలిస్తే 91 శాతం మెరుగ్గా ఉంది. వేగం పరంగా చూస్తే, సంప్రదాయ పద్ధతులతో రోజులు పడే అంచనాలను అరోరా కొన్ని సెకన్లలోనే అందించగలదు.

ఈ ఏఐ టూల్‌ను ఫైన్-ట్యూన్ చేయడం ద్వారా గాలి నాణ్యత, అలల ఎత్తు, తుపానుల మార్గం వంటి అంశాలను మరింత ఖచ్చితంగా అంచనా వేయగలిగారు. ఫిలిప్పీన్స్‌ను తాకిన డోక్సూరి తుపాను మార్గాన్ని అరోరా నాలుగు రోజుల ముందే అంచనా వేసింది. ఇసుక తుఫానులు, సముద్ర అలల ఉద్ధృతి, వాయు కాలుష్యం వంటి అంశాల్లోనూ అరోరా అత్యుత్తమ పనితీరు చూపింది.

మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ‘ఎంఎస్ఎన్ వెదర్’లో అరోరా మోడల్‌ను వినియోగిస్తోంది. అంతేకాక, శాస్త్ర పరిశోధనల కోసం దీనిని ఓపెన్‌సోర్స్‌గా కూడా విడుదల చేసింది. భవిష్యత్తులో వాతావరణ విపత్తులపై ముందస్తు సమాచారం అందించడంలో అరోరా కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.