ఈ రోజు బిగ్ బాస్ హౌజ్‌ని వీడేదెవరు?.. ఉండి పోరాడేదెవరు?

ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక భాష‌ల‌లో సంద‌డి చేస్తున్న బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ . మ‌న‌దేశంలోను అనేక ప్రాంతీయ భాష‌ల‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతున్న బిగ్ బాస్ షో తెలుగులో నాలుగో సీజన్ జ‌ర‌పుకుంటుంది. గ‌త సీజ‌న్స్ క‌న్నా ఈ సీజ‌న్ పెద్ద‌గా అల‌రించలేక‌పోతుంది. తెలిసిన కంటెస్టెంట్స్ లేక‌పోవ‌డం, ఎలిమినేష‌న్ స‌మ‌యంలో బిగ్ బాస్ ప్రేక్ష‌కుల ఓట్స్ ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం లేద‌నే అప‌వాదు మూట‌గ‌ట్టుకోవ‌డం నాలుగో సీజ‌న్‌కు చాలా మైన‌స్ అయ్యాయి. ఓట్ల ప్ర‌కారం చూస్తే మోనాల్ ఎప్పుడో వెళ్లిపోవాలి, కాని బిగ్ బాస్ ఆమెను ద‌త్త పుత్రిక‌లా ఇంట్లోనే ఉంచుతూ కాపాడుకుంటూ వ‌స్తున్నారు అంటూ ప‌లువురు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

బిగ్ బాస్ ఎలిమినేష‌న్‌పై ఇలాంటి విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో స్వ‌యంగా నాగార్జున‌నే దీనిపై క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియా ప్రచారాలు నమ్మొద్దు, కేవలం మీ ఓట్ల ప్రాతిపదికన మాత్రమే ఎలిమినేషన్ జరుగుతుందని చెప్పడం జరిగింది. ఓటింగ్ ప్ర‌క్రియ అంతా థ‌ర్డ్ పార్టీ యాప్ ద్వారా జ‌రుగుతుంది. హాట్ స్టార్, మిస్డ్ కాల్ ద్వారా మీరిచ్చే ఓట్స్ ని పరిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌ని నిన్న‌టి షోలోను నాగ్ తెలిపారు. అయితే ఎంత వివ‌ర‌ణ ఇచ్చిన‌ప్ప‌టికీ ప్రేక్ష‌కుల‌లో మాత్రం చిన్న‌పాటి సందేహాలు అలానే ఉన్నాయి. ఇక ఈ వారం ఎలిమినేష‌న్ విష‌యానికి వ‌స్తే నామినేష‌న్‌లో అభిజిత్, హారిక, మోనాల్, అమ్మ రాజశేఖర్, అవినాష్ నామినేషన్స్‌లో ఉన్నారు. హారికని నిన్న‌టి ఎపిసోడ్‌లో క‌మ‌ల్ సేవ్ చేయ‌గా ఈ రోజు న‌లుగురిలో ఒక‌రు ఎలిమినేట్ కానున్నారు.

నామినేషన్‌లో ఉన్న న‌లుగురిలో అభిజిత్, అవినాష్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. వీరిద్ద‌రు ఇప్ప‌ట్లో ఎలిమినేట్ కారు. ఇంక అవినాష్ కాస్త సింప‌థీ కోరుకుంటూ గేమ్ ఆడుతున్నాడు. ఇక మిగిలిన ఇద్ద‌రిలో అమ్మ రాజ‌శేఖ‌ర్ ప‌రిస్థితి కాస్త డిఫ‌రెంట్‌గా ఉంది. హౌజ్‌మేట్స్‌తో పాటు ప్రేక్ష‌కులు కూడా ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న‌కు విసిగిపోయారు. మాస్ట‌ర్‌ని పంపించేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బిగ్ బాస్ లీకులు కూడా ఆయ‌నే ఎలిమినేట్ అయ్యాడ‌ని చెబుతున్నాయి. అయితే ప్ర‌స్తుతం కెప్టెన్‌గా ఉన్న అమ్మ రాజ‌శేఖ‌ర్ ఈ వారం గండం నుండి బ‌య‌ట‌ప‌డితే వ‌చ్చే వారం కూడా అత‌నికి ఢోకా ఉండ‌దు. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో!