రాత్రి మిగిలిన అన్నం వృథా కాకుండా చద్దన్నం చేసుకుని తినడం చాలామందికి అలవాటు. కానీ ఈ విషయంలో చాలా మంది తెలిసీ తెలియక ఓ పెద్ద తప్పు చేస్తుంటారు. అదే రాత్రి అన్నాన్ని సరైన విధంగా నిల్వ చేయకపోవడం. ఈ ఒక చిన్న తప్పే కడుపులో గ్యాస్, వికారం, వాంతులు, విరేచనాలు ఇలా ఎన్నో సమస్యలకు కారణం అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వాస్తవానికి చద్దన్నంలో బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. ఇది వండిన అన్నం గది ఉష్ణోగ్రతలో ఎక్కువసేపు ఉంటేనే బాగా పెరుగుతుంది. ఒక్కసారిగా పెరిగాక వేడి చేసినా చచ్చిపోదు. అందులోని టాక్సిన్స్ కడుపులోకి వెళితే ఫుడ్ పాయిజనింగ్ వస్తుంది. అందుకే దీనిని ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు.
ముఖ్యంగా వర్షాకాలం, వేసవి వంటి కాలాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. సింపుల్‌గా అన్నం వండిన తరువాత వేడి తగ్గిన వెంటనే ఫ్రిజ్‌లో పెట్టాలి. 24 గంటల్లోపు ఆ అన్నాన్ని తినడం మంచిది. అలాగే రెండు గంటలకు మించి గది ఉష్ణోగ్రతలో ఉంచిన అన్నాన్ని తిరిగి వాడకూడదు. చిన్న జాగ్రత్తలు పాటిస్తే చద్దన్నం మన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. లేదంటే అది ఓ సైలెంట్ కిల్లర్‌గా మారిపోతుంది. అందుకే ఇకపై చద్దన్నం విషయంలో సేఫ్ పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి.