కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు 1983 సంవత్సరంలో విశ్వవిజేతగా ఆవిర్భవించి దేశ క్రికెట్‌లో నవ శకానికి నాంది పలికిన విషయం తెలిసిందే. ఆనాటి భారత టీమ్ అసాధారణ ప్రయాణాన్ని వెండితెర దృశ్యమానం చేస్తూ 83 మూవీని తెరకెక్కించాడు దర్శకుడు కబీర్ ఖాన్ . అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి.
పలు మార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని జూన్ 4న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విడుదల చేయనున్నారు. విష్ణు ఇందూరి భారీ స్థాయిలో నిర్మించిన కపిల్ బయోపిక్‌లో రణ్‌వీర్ సింగ్ కపిల్ దేవ్ గా నటిస్తుండగా ఆయన భార్య పాత్ర దీపికా పదుకొనె చేయడం విశేషం. సునీల్ గవాస్కర్ పాత్రలో బాలీవుడ్ నటుడు తాహీర్ రాజ్ భాసిన్, అప్పటి జట్టు మేనేజర్ మాన్ సింగ్ పాత్రలో పంకజ్ త్రిపాఠి, క్రికెటర్లు సందీప్ పాటిల్ పాత్రలో ఆయన తనయుడు చిరాగ్ పాటిల్, శ్రీకాంత్ పాత్రలో తమిళ నటుడు జీవా, సయ్యద్ కిర్మాణిగా సాహిల్ ఖట్టర్, బల్వీందర్ సింగ్‌గా అమ్మీ విర్క్ కనిపించబోతున్నారు.
టీమిండియాకు తొలి క్రికెట్ ప్రపంచ కప్ అందించారు లెంజెండ్ కపిల్ దేవ్. 16 ఏళ్ల పాటు టీమిండియాకు సేవాలు అందించిన కపిల్ దేవ్.. 131 టెస్ట్‌లు, 225 వన్డే మ్యాచ్‌లు ఆడారు. ప్రపంచంలో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒక్కరూ.. టెస్ట్‌ల్లో 5248 పరుగులతో పాటు 434 వికెట్లు తీశారు. ఇక వన్డేల్లో 3783 రన్స్‌తో పాటు 253 వికెట్లు సాధించారు. 1983 వరల్డ్ కప్‌లో జింబాబ్వేపై కపిల్ దేవ్ చేసిన 175 పరుగులు వన్డేల్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో మైలు రాయిగా నిలిచిపోయింది. మన దేశానికి తొలి వరల్డ్ కప్ అందించిన రియల్ హీరో.