జూన్ 27న గ్రాండ్ గా విడుదల కాబోతున్న కన్నప్ప సినిమాను ప్రమోషన్ పరంగా కొత్త లెవల్‌కు తీసుకెళ్లేందుకు విష్ణు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే భారీ కాస్టింగ్, మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఈ విజయ యాత్ర వెనక ఓ అసహన భరితమైన ప్రయాణం ఉందని తాజాగా విష్ణు వెల్లడించారు. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ విషయంలో ఎదురైన సమస్యలు నిర్మాతగా అతడిని ఎంతగా బాధించాయో ఆయన మాటల్లోనే తెలుస్తోంది.
ఒక అసమర్థ వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్‌ను ఎంపిక చేయడం వల్ల ఏకంగా ఏడాది ఆలస్యం వచ్చిందని, దాంతోనే తన భ్రమ తొలగిపోయిందని విష్ణు చెప్పాడు. ఆ తర్వాత ఆయా నగరాలు, దేశాల్లోని ఎనిమిది వేర్వేరు కంపెనీలకు వీఎఫ్ఎక్స్ పనులు అప్పగించాడట. ఈ ప్రక్రియలో సుమారు 15-20 కోట్లు నష్టపోయినట్టు వివరించారు. దీంతో ఇండస్ట్రీలో వీఎఫ్ఎక్స్ నిపుణుల కొరత ఉన్నదన్న నిజం తెలిసిందని, అందుకే మోహన్ బాబు యూనివర్సిటీలో మూడు సంవత్సరాల స్పెషలైజ్డ్ సిజి కోర్సును ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. ఇది ఇండస్ట్రీకు పెద్ద సేవ అవుతుందని భావిస్తున్నారు.
కన్నప్పలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్ వంటి భారీ తారాగణం నటిస్తుండగా, మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాపై విష్ణు నమ్మకం మామూలుగా లేదు. హార్డ్ డిస్క్ దొరకలేదనే తప్పుడు ప్రచారాలకు చెక్ పెడుతూ, సినిమా రిలీజ్ ఖాయం అని హామీ ఇస్తున్నారు. థియేటర్లలో ఈ సినిమాను చూడగానే అది ఓ మరిచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుందని ధీమాగా చెప్పాడు. త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ లో ఉండగా, ప్రభాస్ పాల్గొననున్నారని తెలుస్తోంది.